ఇది కుట్రపూరితమే
ABN, First Publish Date - 2020-12-30T05:34:54+05:30
వైద్య కళాశాల కోసం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కేటాయించడం కుట్ర పూరితమేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.
- ఆర్‌ఏఆర్‌ఎస్ భూములకు ఎసరు
- రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
- భూమిని కాపాడుకునేందుకు భిక్షాటన
నంద్యాల, డిసెంబరు 29: వైద్య కళాశాల కోసం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కేటాయించడం కుట్ర పూరితమేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని కాపాడాలంటూ మంగళవారం భిక్షాటన చేపట్టారు. తొలుత రామకృష్ణా డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో వైఎన్‌రెడ్డి అధ్యక్షతన రైతులు, న్యాయవాదులు, మేధావులు, విద్యార్థులు, వ్యవసాయ కార్మికులతో పోరాట కార్యాచరణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలకు భూములు కేటాయించేందుకు నిధులు లేకుంటే రైతులుగా తామే భిక్షాటన చేస్తున్నామన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ బహుళజాతి ప్రైవేటు విత్తన సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనా సంస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే రైతులకు, దేశాభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా భూమిని కేటాయించడం బాధాకరమని అన్నారు. పట్టణ సమీపంలో ప్రభుత్వ భూములు ఉన్నా.. ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని తీసుకోవడం వెనుక కుట్ర దాగిఉందని ఆరోపించారు. పరిశోధన సంస్థను కాపాడుకునేందుకు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మార్చి 1 వరకు భిక్షాటన చేపట్టి వచ్చిన డబ్బును రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అనంతరం ప్రధాన వీధుల్లో రైతులు, సాగునీటి సాధన సమితి నాయకులు భిక్షాటన చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సూర నాగరాజారావు, శంకరయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్, బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్ ఉద్యోగి వెంకటసుబ్బయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, బీసీ సంఘం నాయకుడు, పీఎంఆర్ కళాశాలల చైర్మన్ బాలచంద్రుడు, షణ్ముకరావు, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:34:54+05:30 IST