ఇదా ఇంటింటి సర్వే!
ABN, First Publish Date - 2020-04-12T17:44:21+05:30
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో..
కొన్ని ఇళ్లకు ఫోన్‌లోనే పలకరింపు
రెండో విడతా అంతంత మాత్రమే..
ఈ రెండు వారాలు ఎంతో కీలకం
కర్నూలు(అర్బన్): కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి సర్వేపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను ఇంటింటికి తిరిగి గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పట్లో కలెక్టర్ వీరపాండియన్ సీరియస్ అయ్యారు. హెల్త్ ఆఫీసర్‌కు చార్జీ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే విషయంలో కూడా ఇలానే జరిగింది. 170 మందిని గుర్తించామని, వారి శాంపిల్స్ సేకరించామని అధికారులు తొలుత ప్రకటించారు. క్షేత్రస్థాయి సర్వేలో ఈ లెక్కలు సరిపోలేదు. మరో 58 మంది దాకా తప్పించుకుని తిరుగుతున్నారనే సమాచారం మున్సిపల్ అధికారులను కలవరానికి గురిచేసింది.
కానీ ఆలోపే నష్టం జరిగిపోయింది. 5వ తేదీ నుంచి రెండు రోజుల్లో 19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో వీరి కుటుంబ సభ్యులు మరో 700 మంది నుంచి శాంపిల్స్ తీశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో రెడ్ జోన్లను ప్రకటించింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు బృందాలుగా ఏర్పాటు చేసి డోర్ టు డోర్ సర్వేకి ఆదేశించింది. దీని కోసం నగరంలో 2,170 బృందాలను ఏర్పాటు చేసింది.
ఇలా సాగుతోంది..
నగరంలో 1,15,000 ఇళ్లను సర్వే చేయాల్సి ఉండగా కార్పొరేషన్ 9వ తేదీ సాయంత్రానికి 95 వేల కుటుంబాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో విచారించగా తప్పులని, సర్వే తీరు ఆధ్వానంగా ఉందని తెలిసింది. ఇవి రెండో సర్వే వివరాలు. మొదటి సర్వేలో ఎవరూ ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకోలేదని సమాచారం. కొని డివిజన్లలో ఫోన్లు చేసి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఫోన్ ఎత్తితే సరి.. లేదంటే వాళ్లకు తోచింది రాసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒకటి రెండు డివిజన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే మొక్కుబడిగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాబోయే రెండు వారాలు కీలకం..
కరోనా నియంత్రణకు రాబోయే రెండు వారాలు చాలా కీలకమైనవి. ప్రస్తుతానికి నగరం ప్రశాంతంగానే ఉన్నా ఇప్పటికే పాజిటివ్ వచ్చిన 19 మంది నుంచి ఎంత మందికి వైరస్ పాకిందీ రాబోయే రెండు వారాల్లో తెలుస్తుంది. కరోనా విపత్తు ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేక అధికారులు నగరం శివారులో నిర్మించిన పీఎంఈవై గృహాల్లో 2వేల ఐసోలేషన్ బెడ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని పడకలు సిద్ధం చేశారు.
పక్కాగా సర్వే చేస్తున్నాం
నగరంలో సర్వే పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. దాదాపు 95వేల కుటుంబాలను సర్వే చేశారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సిబ్బంది పని చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకుని రండి.
- ఎస్.రవీంద్రబాబు, నగర పాలక సంస్థ కమిషనరు
Updated Date - 2020-04-12T17:44:21+05:30 IST