వైభవంగా దత్తాత్రేయ జయంతి
ABN, First Publish Date - 2020-12-30T05:47:09+05:30
నగరంలోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 29: నగరంలోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. పాతనగరంలోని దక్షిణ షిరిడీ ఆలయంలో, తుంగభద్ర ఒడ్డున గల నాగసాయిబాబా ఆలయంలో, అశోక్‌నగర్‌లోని ద్వారకమాయి సాయిబాబా, ఆంజనేయస్వామి దేవాలయంలో, వెంకటరమణ కాలనీలోని సాయిబాబా మందిరంలో, గుత్తి రోడ్డులోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించారు.
రామిరెడ్డి తాత సేవా సంస్థాన్‌లో: కల్లూరులోని అవదూత రామిరెడ్డి తాత సమాధి మందిరంలో మంగళవారం దత్తజయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి తాతకు పంచామృతాభిషేకం, అర్చన, మహాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే తాత ఆరాధనోత్సవాల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి, రామప్రతాపరెడ్డి, ఎ.విశ్వనాథ్, కోదండస్వామి, శ్రీరాములు, ఎల్లాస్వామి, విఠలారావు, సంపతి లక్ష్మిరెడ్డి, హనుంతరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మద్దికెర: సాయినగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాబా ఆలయంలో దత్తాత్రేయ స్వా మికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం దత్తాత్రేయుడికి పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు రామాంజినేయులు, అంజి, రవి తదితరులు పాల్గొన్నారు.
దత్తాత్రేయ జయంతి వేడుకల్లో బైరెడ్డి
కర్నూలు(ఎడ్యుకేషన్): ఆధ్యాత్మికతకు రాయలసీమ కేంద్ర బిందువు అని బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నగరంలోని అవధూత సదానందస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన దత్తాత్రేయ స్వామి జన్మదిన వేడుకలకు బైరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు.
ఆలూరు రూరల్: స్థానిక సాయిబాబా దేవాలయంలో మంగళవారం దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం, మహామంగళహారతి వంటి పూజలను నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మొళగవల్లి గ్రామంలో వెలసిన మాణిక్యప్రభు దేవాలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను నిర్వహించారు. ఉదయం స్వామి వారికి గంగిపూజ, పంచా మృతాభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:47:09+05:30 IST