అన్న ప్రసాదం
ABN, First Publish Date - 2020-02-20T11:36:42+05:30
భూలోక కైలాసమైన శ్రీశైలంలో అన్నదానం చేస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
మల్లన్న భక్తులకు నిత్యాన్నదానం
యాభై ఏళ్ల క్రితం పది మందికి..
నేడు పది వేల మందికి పైగా..
రూ.7 కోట్లతో అధునాతన భోజన శాలలు
శ్రీశైలం, ఫిబ్రవరి 19: భూలోక కైలాసమైన శ్రీశైలంలో అన్నదానం చేస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. దాతల నుంచి దేవస్థానం విరాళాలు సేకరించి, వారి పేరిట అన్నదానం చేస్తోంది. 50 ఏళ్ల కిత్రం 10 మంది సాధువులకు అన్నదానం చేసేవారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు వేల మంది భక్తుల ఆకలి తీరుస్తోంది. మహా ప్రసాదంగా మారింది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సమర్పిస్తున్నారు. అన్నదాన పథకానికి వచ్చిన విరాళాలు బ్యాంకుల్లో సుమారు రూ.46 కోట్లు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. దీనిపై వచ్చే వడ్డీతో స్వామివారి సన్నిధిలో అన్నదానం చేస్తున్నారు. నిత్యాన్నాదాన పథకానికి రోజుకు రూ.లక్ష ప్రకారం నెలకు రూ.30 లక్షల విరాళం వసూలు అవుతుంది. బ్యాంకుల నుంచి వడ్డీ రూపంలో రూ.3 కోట్లు సమకూరుతోంది.
పది మందితో మొదలై..
భక్తులకు అన్నదానం చేసేందుకు రూ.7 కోట్లతో అధునిక భోజనశాలను ఏర్పాటు చేశారు. పలు రకాల వంటలు సిద్ధం చేసి అన్నపూర్ణాదేవికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత భక్తులకు వడ్డిస్తారు. 80 మందికి పైగా సిబ్బంది ఇందులో పనిచేస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. మొదట్లో శాశ్వత నిత్యాన్నదాన పథకం విరాళం రూ.100 మాత్రమే. ప్రస్తుతం అది రూ.లక్షకు చేరింది. మొదట పది మంది, ఆ తరువాత 600 మంది.. ఇలా సంఖ్య పెరుగుతూ 2004 నాటికి వెయ్యి మందికి అన్న ప్రసాదం అందించారు. 2012 మార్చి నుంచి రెండు వేల మందికి భోజన వసతిని కల్పించడం ప్రారంభించారు. 2014లో ఈ సంఖ్య నాలుగు వేలకు చేరింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఐదు వేల మందికి, శని, ఆది, సోమవారాల్లో పది వేల మందికి పైగా భక్తులకు భోజనం సమకూరుస్తున్నారు.
కానాపురం కూరగాయలు
కానాపురంలో సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను అన్నదాన పథకానికి వినియోగిస్తున్నారు. ఈ గ్రామ రైతుల నుంచి దేవస్థానం నేరుగా కూరగాయలు కొనుగోలు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా దేవస్థానం పనిచేస్తోంది. నిత్యావసర వస్తువుల నాణ్యత పరీక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. కూరగాయలు, పాలు, పెరుగు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేశారు.
సౌరశక్తితో వంట
భోజనం తయారీకి గ్యాస్ సిలిండర్ల వినియోగిస్తే రూ.లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో దేవస్థానం అధికారులు సాంకేతికత వైపు అడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 50 డిప్‌లు (సౌరశక్తి పలకాలు) ఏర్పాటు చేసి సౌరశక్తితో వంట తయారు చేయిస్తున్నారు.
మొదట్లో తక్కువ మందికే.. కాతా రామిరెడ్డి, శ్రీశైల దేవస్థానం మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యులు
శ్రీశైలానికి ప్రతి శివరాత్రికి వచ్చే వాళ్లం. అప్పట్లో తక్కువ మందికి అన్నదానం చేసేవారు. శివరాత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తరువాత అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వడం మొదలైంది. డిపాజిట్లు పెరిగిపోయాయి. తద్వారా ఎక్కువ మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా ఉన్న కాలంలో వెయ్యి మందికి నిత్యం అన్నదానం చేయించాము.
అన్నం బాగుంది.. దేవస్వామి, ఎమ్మిగనూరు
నాలుగు సంవత్సరాలుగా శివమాల ధరించి కాలినడకన శ్రీశైలానికి వస్తున్నాం. శివరాత్రికి మూడు రోజుల ముందే ఇక్కడికి చేరుకుంటాం. నిత్యం స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తాం. అన్నం చాలా బాగుంటుంది.
శుచికరంగా..
నిత్యం వేలాది మంది భక్తులకు పౌష్టిక విలువలు కలిగిన అన్నప్రసాదాన్ని అందింస్తున్నాం. నిత్యాన్నదాన పథకానికి దాతల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఆ మొత్తంతో అన్నదాన పథకాన్ని మెరుగుపరుస్తున్నాం. వివిధ రకాలైన వంటలను శచికరంగా అందిస్తున్నాం.
- కేఎస్ రామారావు, ఈవో
Updated Date - 2020-02-20T11:36:42+05:30 IST