అమ్మఒడి అర్హులు 6,48,503 మంది
ABN, First Publish Date - 2020-12-29T05:26:57+05:30
జగనన్న అమ్మఒడి పథకం జాబితాలోకి పేరు ఎక్కాలంటే చాలా ఆంక్షలను అధిగమించాలి. అప్పుడే ఈ పథకం వర్తిస్తుంది.
- జిల్లాలో 7,26,001 మంది విద్యార్థులు
- అనర్హుల జాబితాలో 66,591 మంది
- విత్‌హెల్డ్ జాబితాలో 10,907 మంది
- సచివాలయాల చుట్టూ తల్లిదండ్రులు
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 28: జగనన్న అమ్మఒడి పథకం జాబితాలోకి పేరు ఎక్కాలంటే చాలా ఆంక్షలను అధిగమించాలి. అప్పుడే ఈ పథకం వర్తిస్తుంది. తాజాగా అమ్మఒడి పథకం జాబితాలను అన్ని పాఠశాలలో ప్రదర్శించారు. గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకుడికి లాగిన్‌లో పంపారు. జాబితా వచ్చిన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. పాఠశాలల్లోని విద్యార్థులను అర్హులు, అనర్హులు, తాత్కాలిక నిలుపుదల జాబితాలుగా విభజించారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు 4,379 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 10 వరకు చదువుతున్న విద్యార్థులు 7,26,001 మంది ఉన్నారు. ఇందులో అర్హుల జాబితాలో 6,48,503 మంది, అనర్హుల జాబితాలో 66,591 మంది, విత్‌హెల్డ్ (తాత్కాలిక నిలుపుదల జాబితా)లో 10,907 మంది ఉన్నారు. అమ్మఒడి అనర్హులు గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని, దీని కోసం ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. విత్‌హెల్డ్, అనర్హుల జాబితాల్లో పేర్లు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వాటిని సరి చేసుకోవడానికి వార్డు/గ్రామ సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 28వ తేదీన అన్ని పాఠశాలలో పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించి అర్హుల జాబితాలను తల్లిదండ్రులకు తెలియజేశారు. అనర్హతకు కారణాలను గ్రామ వలంటీర్లు సేకరించి గ్రామ సచివాలయంలో సరి చేస్తున్నారు. 30వ తేదీ నాటికి గ్రామ సచివాలయ అభ్యంతరాల పరిష్కారం పూర్తి కావాల్సి ఉంది. 31న గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను ఆమోదించాలి. ఆమోదించిన జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి లాగిన్‌కు హెచ్‌ఎంలు పంపుతారు. డీఈవో ఈ జాబితాను పరిశీలించి కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారు. జనవరి 9వ తేదీన ప్రభుత్వం ఒక్కో విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో అమ్మఒడి డబ్బును జమ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల పైన, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల పైన నెలసరి ఆదాయం ఉన్న వారు, మూడెకరాల మాగాణి, పదెకరాల మెట్ట, లేదా రెండు కలిపి పది ఎకరాలు ఉన్నవారు, 300 యూనిట్లు విద్యుత్ బిల్లు దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగం లేదా, ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు వారు, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, పురపాలక సంఘాల్లో వెయ్యి గజాలకు మించి స్థలం ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించింది. తల్లి వివరాలు మార్చినా.. తల్లికి బదులు గార్డియన్ వివరాలు ఉంచినా, తల్లి, పిల్లల ఆధార్ సరికాకపోవడం వంటి సమస్య ఉన్నవారిని విత్‌హెల్డ్ జాబితాలో చూపారు. ఇలాంటి నిబంధనల వల్ల తమ పిల్లలకు అమ్మఒడి పథకం ఆర్థిక సాయం అందదని తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనర్హులు ఉంటే తొలగించాలి: డీఈవో సాయిరాం
జగనన్న అమ్మఒడి పథకం అర్హుల జాబితాలో అనర్హులు ఉంటే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరిశీలించి తొలగించాలి. డిలిట్ ఆఫ్షన్ హెచ్‌ఎం లాగిన్‌లో ఇచ్చాం. 28వ తేదీన అన్ని పాఠశాలల్లో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టి, అర్హుల జాబితాను వారికి తెలియజేయాలి. అర్హుల జాబితాను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాలి. గ్రామ వలంటీర్ అనర్హుల జాబితాలో ఉన్నవారిని కలిసి కారణాలు తెలపాలి. వారి అభ్యంతరాలను గ్రామ సచివాలయంలో ఇవ్వాలి. 30వ తేదీ నాటికి గ్రామ సచివాలయంలో అభ్యంతరాలను పరిష్కరించాలి. 31న గ్రామ సభలు అర్హుల తుది జాబితాను ఆమోదించాలి. విత్‌హెల్డ్, ఎలిజిబుల్ కరెక్షన్ అథెంటికేషన్ హెచ్‌ఎం లాగిన్‌లో ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ పిల్లల పేరు అర్హుల జాబితాలో ఉంటే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి తొలగించుకోవాలి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠశాలల యజమాన్యాలదే బాధ్యత. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలపైన, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలపైన ఎక్కువ జీతం వున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు.
Updated Date - 2020-12-29T05:26:57+05:30 IST