నమ్మి మోసపోయాం
ABN, First Publish Date - 2020-06-18T09:48:17+05:30
‘కావలి-బెంగళూరు రూటులో బెంగళూరు నుంచి సాయంత్రం వచ్చే ఫస్ట్ బస్సులో నేను విధులు నిర్వహించేవాడిని. వన్‌మేన్ సర్వీస్
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం..
ఫేక్ జాబ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అగ్రనేత వి.రవికుమార్ ఉదంతంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రిమూవ్‌డ్ డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను కూడా ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చి తమ జీవితాలకు తీరని క్షోభకు గురిచేయటంపై బాధపడుతున్నారు. తమ తప్పేం లేకున్నా పోలీసులు చేసిన పొరపాటుకు బలి కావాల్సి వచ్చిందని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చేసిన అప్పీల్ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో, రవికుమార్ ఉదంతం తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో తొలగించబడిన డ్రైవర్లలో ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఆంధ్రజ్యోతి, విజయవాడ": ‘కావలి-బెంగళూరు రూటులో బెంగళూరు నుంచి సాయంత్రం వచ్చే ఫస్ట్ బస్సులో నేను విధులు నిర్వహించేవాడిని. వన్‌మేన్ సర్వీస్ కాబట్టి డ్రైవర్, కండక్టర్‌గా రెండు బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చేది. సీటింగ్ 56 ఉంటే 96 మంది ప్రయాణికులు ఎక్కేవారు. డ్రైవర్‌గా ఇంతమందిని బస్సులో ఎక్కించి తోలటం ఒక ఎత్తయితే కిటకిటలాడే బస్సులో టికెట్లు కొట్టడం కత్తిమీద సాములా ఉండేది. బస్సులో ఎక్కేవారిని ప్రయాణికులు అనుకుంటాం కానీ, ఎవరు దొరలో, ఎవరు దొంగలో మాకేం తెలుస్తుంది. ఎర్రచందనం కూలీలను తరలిస్తున్నామన్న అపవాదును పోలీసులు మాపై వేశారు. ఒకరోజు కావలి పోలీసులు మా ఇంటికొచ్చి విచారణ చేయాలని చెప్పారు. నేను వెంటనే డీఎంకు ఫోన్‌చేసి చెప్పాను. విచారణే కదా.. వెళ్లిరా.. అని డీఎం చెప్పటంతో వెళ్లాను. తీరా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే అటు నుంచి అటే సెంట్రల్ జైలుకు పంపారు. నేను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌కు వస్తే కడపలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఎర్రచందనం కూలీలను తరలిస్తున్నట్టుగా అక్రమంగా కేసు నమోదు చేశారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని ఆర్టీసీ అధికారులకు కూడా తెలుసు. అయినా.. ఉన్నత స్థాయిలో వచ్చిన ఆదేశాలతో మమ్మల్ని తొలగించారు. దీంతో ఉన్న ఊరిలో ఉండలేక, పొరుగూరిలో ఉండాల్సి వచ్చింది. ప్రైవేటుగా ఏదో పని చేసుకుంటూ అర్థాకలితో జీవిస్తున్నాం. హెడ్డాఫీసులో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఎవరో చెబితే రవికుమార్‌ను కలిశాం. విషయం ఆయనకు చెప్పాక నమ్మించి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రూ.3లక్షలు అప్పు చేసి ఇచ్చాం.
ఆ తర్వాత డబ్బుకు సంబంధించి రవికుమార్ ను నిలదీయడంతో స్టాంప్ పేపర్‌పై రాసిచ్చాడు. ఆ తర్వాత రవికుమార్ దగ్గర ఉన్న కారును మేము తీసుకొచ్చాం. డబ్బు ఇచ్చి కారు తీసుకెళ్తామని రవికుమార్ చెప్పాడు. గడువులోపు డబ్బు ఇవ్వకపోతే కారును అమ్మేసుకోమన్నాడు. ఈలోపు ఈ స్కామ్ బయటకు రావడంతో మా పేర్లు బయటకు వచ్చాయి. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న మేము.. రవికుమార్ ఉదంతంతో భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో పడ్డాం..’ అని ఆ బాధితుడు పేర్కొన్నారు.
Updated Date - 2020-06-18T09:48:17+05:30 IST