క్వారంటైన్ ఏర్పాటుపై ఆటపాకలో ఉద్రిక్తం
ABN, First Publish Date - 2020-03-27T09:02:07+05:30
ఆటపాకలో క్వారంటైన్ సెంటర్ వద్దంటూ ప్రజలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆటపాకలోని శ్రీచైతన్యస్కూల్లో అధికారులు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.
కైకలూరు, మార్చి 26: ఆటపాకలో క్వారంటైన్ సెంటర్ వద్దంటూ ప్రజలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆటపాకలోని శ్రీచైతన్యస్కూల్లో అధికారులు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం గ్రామస్థులు ఆందోళన చేయగా టౌన్ ఎస్సై షణ్ముఖసాయి వారికి నచ్చజెప్పి పంపించి వేశారు. గురువారం వందలాది మంది గ్రామస్థులు స్కూల్ వద్దకు చేరుకుని వైద్యసిబ్బంది తీసుకువెళ్లే సామగ్రిని లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఐ కె.వి.వి.లక్ష్మీనాయుడు సర్కిల్ పరిధిలోని కైకలూరు రూరల్, కలిదిండి, మండవల్లి ఎస్సైలు, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఐ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్ నిర్వహించడం వల్ల ప్రజలకు ఏ విధమైన ముప్పు ఉండదని, అవగాహనతో ప్రజలు సహకరించాలన్నారు. సుమారు గంటసేపు గ్రామస్థులతో చర్చించిన మీదట ఆందోళన విరమించారు.
Updated Date - 2020-03-27T09:02:07+05:30 IST