రూ.100 కోట్ల దేవుడి ఆస్తి చేజిక్కించుకునేందుకు.. మాస్టర్ ప్లాన్ రెడీ!
ABN, First Publish Date - 2020-12-11T07:02:59+05:30
రూ.100 కోట్లకుపైగా విలువైన దేవుడి ఆస్తి..
దేవుడి ఆస్తికి టెండర్!
దేవదాయ శాఖ ఆధీనంలోని సంస్థలు ప్రైవేటుకు!
రూ.100 కోట్ల ఆస్తులపై మంత్రి బినామీల కన్ను
ప్రైవేటు వ్యక్తుల చేతికి బ్రాహ్మణవీధి వెంకటేశ్వరస్వామి దేవస్థానం
దాంతోపాటు మరో మూడు ఖరీదైన సంస్థలనూ అప్పగించే యత్నం
వాటిని తమకు అప్పగించాలని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ లేఖ
ఆగమేఘాలపై స్పందించిన మంత్రి..
చకచకా కదులుతున్న ఫైలు
విజయవాడ - ఆంధ్రజ్యోతి: రూ.100 కోట్లకుపైగా విలువైన దేవుడి ఆస్తి చేజిక్కించుకునేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. తమ సామాజికవర్గం వారే వాటిని ఏర్పాటు చేశారని.. తమ దేవస్థానం పక్కనే అవీ ఉన్నాయని.. అక్కడికి వచ్చే భక్తుల్లో అధికశాతం తమ సామాజికవర్గం వారేనంటూ లాజిక్కులు లాగి మరీ రూ.100 కోట్ల ఆస్తిని హాంఫట్ చేసేందుకు దేవదాయశాఖ మంత్రి బినామీలు చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తూ మంత్రి ఆశీస్సులు ఉండటంతో ఇందుకు సంబంధించిన ఫైలు ఆగమేఘాలపై సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవాలయాలకు చెందిన ఖరీదైన ఆస్తులపై అధికారపార్టీ నాయకులు కన్నేశారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్ల విలువైన 900 గజాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గన్నవరంలోని శ్రీభువనేశ్వరి పీఠం ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. తాజాగా సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులున్న నాలుగు సంస్థలపై మంత్రి అనుచరులు కన్నేశారు.
విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం చెంతనే నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్, నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటం, పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటం ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటాన్ని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ (ఎఫ్‌ఎఫ్‌ఎం) పర్యవేక్షిస్తుండగా, మిగిలిన మూడు సంస్థలను దేవదాయశాఖ ఈవోలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నాలుగు సంస్థలకు జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. వీటిపైన మంత్రి బినామీల కన్ను పడింది. వెంటనే ఆస్తులను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం అయింది. శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మేనేజింగ్ కమిటీ పేరుతో ఓ లేఖ సిద్ధమైంది. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న పై నాలుగు సంస్థలను తమకు అప్పగించాలన్నది లేఖ సారాంశం. ఈ లేఖను దేవదాయశాఖ మంత్రికి డిసెంబరు ఏడున ఇవ్వగా, ఆయన అదే రోజు ఆ లేఖపై ఫైలును సర్క్యులేట్ చేయాల్సిందిగా రాసేశారు.
కట్టింది మావాళ్లే ఇచ్చేయండి..!
దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న నాలుగు సంస్థలను తమకు అప్పగించాలంటూ శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ రాసిన లేఖ మరీ విడ్డూరంగా ఉంది. పై నాలుగు సంస్థలను ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసినందున.. అవి తమ దేవస్థానం పక్కనే ఉన్నందున.. వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే వారిలో అధికశాతం వైశ్యులైనందున వాటిని తమకు అప్పగించాలని లేఖలో కోరారు. తమకు అప్పగిస్తే దేవదాయశాఖ కన్నా మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 15, 29ని అనుసరించి ఆ నాలుగు సంస్థలను ఎండోమెంట్ నుంచి మినహాయించి తమ దేవస్థానంలో కలిపివేయాలని విన్నవించారు. శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. అలాంటి కమిటీ చేతిలోకి రూ.100 కోట్లు ఆస్తులున్న సంస్థలను, అది కూడా దేవదాయశాఖకు అన్ని హక్కులూ ఉన్న సంస్థలను కట్టబెట్టడం ఏమిటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఆ ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే..
బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి జిల్లావ్యాప్తంగా ఆస్తులున్నాయి. గూడవల్లి, పోరంకి, యనమలకుదురు, ఉంగుటూరు మండలం వేమండ ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే భూములు, విజయవాడ గవర్నర్‌పేటలో దుకాణాలు, పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఉన్న స్థలం దేవస్థానానికి చెందినవే. ఈ ఆలయంతో కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీకి సంబంధం లేదు. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం చాళుక్యులు నిర్మించారని చెబుతారు. అలాంటి ఆలయానికి సామాజికవర్గం రంగుపులిమి, ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్‌కు, నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటానికి ఉమ్మడిగానూ, వేర్వేరుగానూ కోట్ల విలువ చేసే భూములున్నాయి. పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటానికి వన్‌టౌన్‌లో వాణిజ్య సముదాయం, కోట్ల విలువ చేసే భూములూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సంస్థల ఆస్తి మొత్తం రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఆస్తులను తమ పరం చేసుకునేందుకే మంత్రి అనుచరులు కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ముసుగులో పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఆశీస్సులు ఉండటంతో దీనికి సంబంధించిన ఫైలు కూడా ఆగమేఘాలపై కదులుతున్నట్లు సమాచారం.
కోర్టును ఆశ్రయిస్తాం
కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ముసుగులో రూ.100 కోట్ల ఆస్తులను తన బినామీల ద్వారా స్వాహా చేసేందుకు దేవదాయశాఖ మంత్రి స్కెచ్ వేశారు. దేవదాయ శాఖ భూమి ప్రభుత్వానిది కాదు. ఆ శాఖ పరిధిలోని భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలంటే ముందుగా హైకోర్టు అనుమతి తీసుకోవాలి. దీనికి వ్యతిరేకంగా వందల కోట్ల విలువైన దేవదాయశాఖ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు పావులు కదపడంపై న్యాయపోరాటం చేస్తాం.
Updated Date - 2020-12-11T07:02:59+05:30 IST