రౌడీయిజంతో గెలవాలనుకుంటున్నారు
ABN, First Publish Date - 2020-03-16T10:40:59+05:30
రౌడీయిజంతో గెలవాలనుకుంటున్నారు
గన్నవరం, మార్చి 15: ప్రజాక్షేత్రంలో టీడీపీని ఎదుర్కొనే సత్తాలేక రౌడీయిజంతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. టీడీపీ మండలాధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణమున్న గన్నవరంలో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఎమ్మెల్యే వంశీ అనుచరుల దౌర్జన్యం, పోలీసుల అండతోనే టీడీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపజేసి ఏకగ్రీవం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే దర్శకత్వంలో, పోలీసుల సాయంతో గన్నవరం సెగ్మెంట్-6 టీడీపీ అభ్యర్థి కాటుమాల కాంతారావుతో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు నామినేషన్ ఉపసంహరింపజేశారన్నారు.
ఆ వార్డు ఎలా ఏకగ్రీవం చేస్తారు?
టీడీపీ అభ్యర్థులు అందరూ పోటీలో ఉన్నారని అధికారులు ప్రకటించాక ఆ వార్డు ఏకగ్రీవమని ఎలా ప్రకటించారో చెప్పాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు పార్టీ మండలాధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు కారు అద్దాలు పగులకొట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఓట్లు వేసి వంశీని గెలిపిస్తే దాడులు, బెదిరింపులతో ముఖ్యమంత్రి మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి దొంతు చిన్న, ఉపాధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు నాయకులు కంభంపాటి సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T10:40:59+05:30 IST