ధాన్యం కొనుగోళ్లలో నిబంధనాలు
ABN, First Publish Date - 2020-12-30T06:11:44+05:30
నిన్నటి వరకూ ప్రకృతి విపత్తులు.. నేడు అధికారులు పెడుతున్న తిప్పలు రైతులకు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి..
ఎకరానికి 29 బస్తాల ధాన్యమే కొనుగోలు
తొలుత 21 బస్తాలే కొంటామని షరతులు
మిగిలిన ధాన్యం ఏమి చేసుకోవాలని రైతుల ప్రశ్న
ఎడిట్ ఆప్షన్‌ను సక్రమంగా ఉపయోగించని వైనం
నిన్నటి వరకూ ప్రకృతి విపత్తులు.. నేడు అధికారులు పెడుతున్న తిప్పలు రైతులకు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి.. జిల్లాలో వ్యవసాయాధికారులు నిబంధనల పేరుతో అన్నదాతలను అడుగడుగునా అవస్థలపాల్జేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఏదో ఒక వంకతో ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో పరిమితిని తగ్గించి, రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. అధికారులు తమ ఇష్టానుసారం నిబంధనలు మారుస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌సీజన్‌లో 2.45 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగింది. 13.50 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. నివర్ తుపాను తాకిడికి పంట నేలవాలి, ఽధాన్యం దిగుబడి తగ్గిందనే సాకు చూపి, కొనుగోళ్లలో రకరకాల అంక్షలు పెడుతున్నారు. ఈ కారణంతో తొలుత ఎకరానికి 40 కిలోల చొప్పున 40 సారలు (21బస్తాల) ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనపెట్టారు. రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఎకరానికి 40 కిలోల చొప్పున 55 సారలు (29 బస్తాలు) కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రానికి వెళితే, ఎకరానికి 55 సారలు మించి విక్రయించేందుకు అవకాశంలేదని ఆర్‌బీకేలలో చెబుతున్నారు. మరి మిగిలిన ధాన్యాన్ని ఏం చేసుకోవాలి అన్నదే అందరి ప్రశ్న. గత ఏడాది ఎకరానికి 70 సారల వరకు అనుమతిచ్చారని, ఈ ఏడాది 55 సారలకు పరిమితం చేశారని రైతులు అంటున్నారు. గతంలో స్థానిక వీఆర్వో, లేదా మండల వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తే అధిక దిగుబడిని పరిగణనలోకి తీసుకునేవారని, ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేశారని రైతులు అంటున్నారు. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో దిగుబడి అధికంగా వచ్చిందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆర్‌బీకే ఉద్యోగుల ఇష్టారాజ్యం
రైతులు ధాన్యం విక్రయించాలంటే ముందుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్లాలనే నిబంధన పెట్టారు. రైతులు విక్రయించిన ధాన్యం ఏ రైస్‌మిల్లుకు వెళ్లాలనేది ఆర్‌బీకేల్లో నిర్ణయిస్తారు. కేటాయించిన మిల్లుకే ధాన్యాన్ని తరలించి, అక్కడి నుంచి లెవీ బియ్యాన్ని సేకరించాల్సి ఉంది. అయితే తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఆర్‌బీకేలో నిబంధనలను పక్కనపెట్టి, అక్కడి ఉద్యోగులు తమ ఇష్టానుసారం మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడి ఉద్యోగులు చేసిన తప్పులు ఆన్‌లైన్‌లో చూస్తే ఇట్టే తెలిసిపోతుందని మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు. ఈ-క్రాప్‌లో నమోదై ఉంటేనే ఽధాన్యం కొనుగోలు చేస్తారని, అందుకు సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో జమవుతుందని ఆంక్షలు విధించారు. ఇప్పటికీ ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. అయితే రైతులు ధాన్యం విక్రయించిన సమయంలో ఆర్‌బీకేల్లో పనిచేసే సిబ్బంది ఈ-క్రాప్ ఎడిట్ ఆప్షన్‌ను సక్రమంగా వినియోగించకపోవడంతో ధాన్యం విక్రయించేందుకు అవకాశాలు లేకుండా పోతున్నాయని రైతులు అంటున్నారు. నివర్ తుఫాన్ కారణంగా ధాన్యం దెబ్బతిన్న నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా అమలు చేసి, ధాన్యం కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో మినుముసాగు ఉంది. మినుము సాగు చేసే భూముల్లో నూర్పిళ్లు రెండు నెలలు ఆలస్యంగా జరుగుతాయి. నూర్పిళ్లు ముమ్మరమైతే ధాన్యం కొనుగోళ్లలో మరిన్ని ఇబ్బందుల తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
Updated Date - 2020-12-30T06:11:44+05:30 IST