వైఎస్సాఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత వడ్డానపై రెండ్రోజుల్లో ఆర్టీసీ చర్యలు..!
ABN, First Publish Date - 2020-08-22T17:51:46+05:30
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బోగస్ ఆర్డర్స్ సృష్టించి నిరుద్యోగు లను అందినకాడికి ముంచిన వైఎస్‌ఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత వడ్డాన రవికుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
సర్వీసు నుంచి తొలగించే అవకాశం
ఫేక్ జాబ్ స్కామ్ సూత్రధారిగా రవికుమార్
బోగస్ ఆర్డర్స్‌తో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బోగస్ ఆర్డర్స్ సృష్టించి నిరుద్యోగు లను అందినకాడికి ముంచిన వైఎస్‌ఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత వడ్డాన రవికుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. తాను జైలులో ఉన్నందున వివరణ పంపేందుకు గడువు కోరటంతో ఆగస్టు 20వరకు ఆర్టీసీ కృష్ణా రీజియన్ అధికారులు గడువు ఇచ్చారు. వాస్తవానికే ఇప్పటికే రెండుసార్లు గడువు ఇచ్చిన అధికారులు ఇక ఇదే ఫైనల్ అని ఇంతకు ముందే తేల్చి చెప్పారు. జైలులో ఉన్నానని ఆర్టీసీకి సమాచారం ఇచ్చిన రవికుమార్ బెయిల్‌పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయినా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండటంపై అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన గడువు ముగిసింది కాబట్టి రెండ్రోజుల్లో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. విద్యాధరపురం బస్ డిపో మేనేజర్ ముందుగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ఆర్‌ఎం దృష్టికి తీసుకువచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ప్రొసీ డింగ్స్ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫోర్జరీ ఆర్డర్స్ సృష్టించటం తీవ్రమైన నేరంగా ఆర్టీసీ భావిస్తోంది. నిరుద్యోగులను మభ్యపెట్టి లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడినందుకు బాధితులు పలు పోలీసు స్టేషన్లలో వడ్డానపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు అతనిపై 420 కేసులు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు విచారించి అరెస్టు చూపారు. ఆర్టీసీ విజిలెన్స్ ప్రాథమిక నివేదిక మేరకు కృష్ణా రీజియన్ అధికారులు విచారణ అధికారిని నియమించారు. ఆయనిచ్చిన రిపోర్టు తర్వాత విద్యాధరపురం డిపోలో డొమెస్టిక్ ఎంక్వయిరీకి ఆదేశించారు. ఇందులో తేడా వస్తే మళ్లీ సర్వీసులోకి తీసుకోవటం కష్ట మౌతుంది. రవికుమార్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Updated Date - 2020-08-22T17:51:46+05:30 IST