ఆశాలపై పోలీసులు దౌర్జన్యకాండ
ABN, First Publish Date - 2020-11-03T15:26:42+05:30
నోరు నొక్కేశారు.. లాగి పడేశారు.. ఎత్తి కుదేశారు..
పోలీసుల దౌర్జన్యకాండ..
తమను సచివాలయాలకు అప్పగించొద్దని ఆశాల ధర్నా
అడ్డుకున్న పోలీసులు.. తోపులాట..
స్వల్పగాయాల పాలైన ఆశావర్కర్లు
విజయవాడ సిటీ: నోరు నొక్కేశారు.. లాగి పడేశారు.. ఎత్తి కుదేశారు.. రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా తమ నిరసన తెలిపేందుకు రోడ్లపైకి వచ్చిన ఆశాలపై పోలీసులు దౌర్జన్యకాండ నిర్వహించారు. సోమవారం నాడు ధర్నాచౌక్‌లో జరిగిన అమానవీయ ఘటనతో రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం నాడు చేతిలో చెయ్యేసి హామీల మీద హామీలిచ్చిన సీఎం జగన్ నేడు అదే చేత్తో తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం పట్ల ఆశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ హక్కును కాలరాసేందుకు ప్రయత్నించడం పట్ల అన్ని వర్గాల నుంచి నిరసనలు వస్తున్నాయి.
ఆశావర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశావర్కర్లను సచివాలయాలకు అప్పగించవద్దని, పని భారం, వేధింపులు అరికట్టాలనే తదితర డిమాండ్ల సాఽధనకు ఏపీ ఆశావర్కర్స్ యూనియస్ (సీఐటీయూ) ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాశాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కె.ధనలక్ష్మి మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య పథకం నిబంధనల మేరకు వేయి మంది జనాభాకు ఒక ఆశావర్కర్ పని చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 2,500 నుంచి 8వేల మందికి ఒక ఆశావర్కర్‌ను నియమించడం సరైంది కాదన్నారు. ఆశావర్కర్లను ప్రభుత్వ రికార్డుల్లో ఉద్యోగులు గా నమోదు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ 60ఏళ్లు దాటిన ఆశావర్కర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు.
సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు, ఎన్.సి.హెచ్,శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరావు, ఆశావర్కర్స్ యూనియన్ నేతలు ఎ.కమలల, పి.ధనశ్రీ ప్రసంగించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి ర్యాలీగా బయలు దేరుతున్న ఆశాలను పోలీసులు అడ్డుకుని నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు స్వల్పగాయాలయ్యాయి.
Updated Date - 2020-11-03T15:26:42+05:30 IST