బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై వివక్ష దారుణం
ABN, First Publish Date - 2020-12-11T05:53:52+05:30
గత ఏడాది కాలంలో ఇసుక కొరతతో కొవిడ్ కారణంగా పనులు లేక 40 మంది కార్మికులు చనిపోయినా బిల్డింగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి నరసింహారావు ఆగ్రహం
గుడివాడటౌన్, డిసెంబరు 10 : గత ఏడాది కాలంలో ఇసుక కొరతతో కొవిడ్ కారణంగా పనులు లేక 40 మంది కార్మికులు చనిపోయినా బిల్డింగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ కార్యాలయంలో గురువారం బిల్డింగ్ వర్కర్స్ విస్త్రృతస్థాయి జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు క్లయిమ్స్ మంజూరై ఏడాది గడిచినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇసుక కొరతతో పనులు లేక ఆకలి దప్పులతో రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది కార్మికులు మరణించారన్నారు. కొవిడ్ కారణంగా ఇల్లు వదలి వెళ్ళవద్దన్న ప్రభుత్వం కరువు భత్యం కింద కార్మికులకు సంక్షేమ బోర్డు నిధి రూ.10వేలు ఇవ్వాలని పోరాటాల తదనంతరం మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించినా వైసీపీ ప్రభుత్వానికి కరుణ కలుగలేదని ఆరోపించారు. బిల్డింగ్ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి కెవి.గోపాలరావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నుంచి తమకు మంజూరైన క్లయిమ్స్, కరువు భత్యం రూ.10 వేలు ఇచ్చి ఇసుక సరఫరా చేయాలని అడిగితే మంత్రి కొడాలి నాని విషయాన్ని దారి మళ్లిస్తూ హైదరాబాద్, చెన్నై, బెంగాల్‌లలో ఇసుక ఎంత ఉందో తెలుసా అంటూ జోకులు విసిరారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని ఈ నెల 15వ తేదీన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో విజయవాడను జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్‌కు నరసింహారావు పిలుపునిచ్చారు.
Updated Date - 2020-12-11T05:53:52+05:30 IST