స్క్రీన్ షాక్.. విజయవాడ ఆర్టీసీలో ఎల్‌ఈడీ బిగ్ స్ర్కీన్ల బాగోతం
ABN, First Publish Date - 2020-10-03T17:17:06+05:30
కోట్లు కుమ్మరించి ఆర్టీసీ కొనుగోలు చేసిన భారీ ఎల్‌ఈడీ బిగ్‌స్ర్కీన్లు పనికిరావని తేల్చారు. టెక్నాలజీ అప్‌డేటెడ్ పేరుతో ఓ ప్రైవేటు సంస్థ సొంతగా బిగ్ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తామంటే ఉన్న స్ర్కీన్లను తీసేసి మూలన పెట్టేశారు. ప్రైవేటు సంస్థ కోసం
రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆర్టీసీ
ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచిన బిగ్ స్ర్కీన్లు
తాజాగా ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు
వారి కోసం సంస్థ స్ర్కీన్లు మూలకు!
ఆర్టీసీకి భారీ నష్టం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కోట్లు కుమ్మరించి ఆర్టీసీ కొనుగోలు చేసిన భారీ ఎల్‌ఈడీ బిగ్‌స్ర్కీన్లు పనికిరావని తేల్చారు. టెక్నాలజీ అప్‌డేటెడ్ పేరుతో ఓ ప్రైవేటు సంస్థ సొంతగా బిగ్ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తామంటే ఉన్న స్ర్కీన్లను తీసేసి మూలన పెట్టేశారు. ప్రైవేటు సంస్థ కోసం ఆర్టీసీకి చెందిన బిగ్ స్ర్కీన్లను పనికి రాకుండా చేస్తారా? ఇది ఖర్చు తగ్గించుకోవడమో, దుబారా చేయడమో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. పీఎన్‌బీఎస్‌లో ప్రయాణికులకు వినోదం పంచటం కోసం ఏర్పాటు చేసిన భారీ బిగ్ స్ర్కీన్ల బాగోతం ఇది!
ఒక ప్రైవేట్ యాడ్ సంస్థ ప్రయోజనం కోసం పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్లో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బిగ్ స్ర్కీన్లను తొలగించి, మూలన పెట్టేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఆ స్థానంలో యూనీ యాడ్స్ అనే ప్రైవేటు సంస్థ అప్‌డేటెడ్ టెక్నాలజీకి అనుగుణంగా కొత్త స్ర్కీన్లను ఏర్పాటు చేస్తుందట! ఆర్టీసీ పక్కన పెట్టిన బిగ్ స్ర్కీన్ల విలువ రూ.రెండు కోట్లు. వీటిని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ తన సొంత నిధులతో కొనుగోలు చేసింది. ఆధునిక ఎయిర్‌పోర్టుల మాదిరిగా పీఎన్‌బీఎస్‌ను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నాటి ప్రభుత్వం పీఎన్‌బీఎస్‌ను ఆధునికీకరిం చింది. అందులో భాగంగానే బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ఆర్టీసీ హై పిక్చర్ క్వాలిటీ రిజల్యూషన్ కలిగిన నాలుగు ఎల్‌ఈడీ స్ర్కీన్లను డిపార్చర్ బ్లాక్ నలువైపులా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సినిమాలు, పాటలు ప్రసారం చేయటానికి ఒక ఏజన్సీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆర్టీసీనే స్వయంగా వీటి నిర్వహణను చూసుకుంది.
ఆర్టీసీ బిగ్ స్ర్కీన్లు పనికిరావా?
యూనీ యాడ్స్‌కు ఆర్టీసీ ఉన్నతాధికారులు బిగ్ స్ర్కీన్ల నిర్వహణ అప్పగించిన తర్వాత సడెన్‌గా పీఎన్‌బీఎస్‌లోని ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఆర్టీసీ సిబ్బందే ఊడదీసి, మూలన పెట్టేశారు. నిర్వహణ చేపట్టిన ప్రైవేటు సంస్థకు ఈ స్ర్కీన్లు పనికి రావట. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున తామే సొంతగా స్ర్కీన్లను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సొంత స్ర్కీన్లను ఆర్టీసీ అధికారులు తొలగించారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే స్ర్కీన్లను ఎందుకు మూలన పెట్టేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మూలన పడేసిన స్ర్కీన్లు పాడైపోతే జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఒకవేళ సెకండ్ హ్యాండ్ కింద వీటిని అమ్మినా ఆర్టీసీకి భారీ నష్టమే వాటిల్లుతుంది. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డెవలప్‌మెంట్ చార్జీలతోనే వీటిని కొనుగోలు చేశారు. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయటం సమంజసమా? ఆర్టీసీ ఉన్నతాధికారులకే తెలియాలి.
డిపార్చర్ బ్లాక్ ఎంక్వయిరీ ఎదుట మెట్ల మార్గంలో మరో భారీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ వార్తలు, బస్సుల సమాచారాన్ని ప్రసారం చేసేవారు. ఈ స్ర్కీన్లు బస్‌స్టేషన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇటీవల ఈ స్ర్కీన్లను ఆపరేట్ చేస్తున్న ఏజన్సీతో ఒప్పందం గడువు ముగిసింది. ఆర్టీసీ కావాలనుకుంటే గడువు పొడిగించి, స్వయంగా నిర్వహించవచ్చు. కానీ అలా చేయలేదు. అధికారపక్షం నుంచి ఒత్తిళ్లు కూడా రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు దీని నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని భావించారు. కొద్ది కాలం క్రితమే వీటి నిర్వహణ కోసం ప్రైవేటు పార్టీలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఇదంతా గుంభనంగా సాగింది. బిగ్ స్ర్కీన్ల నిర్వహణను యూనీ యాడ్స్ సంస్థకు అప్పగించారు. ఇదే సంస్థ అరైవల్ బ్లాక్‌లో ఇంతకు ముందు వీటి నిర్వహణ మీద ఆసక్తితో ఒక ఎల్‌ఈడీ బిగ్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే సంస్థకు డిపార్చర్ బ్లాక్‌లోని బిగ్ స్ర్కీన్ల నిర్వహణ కూడా అప్పచెప్పటంతో టెండర్ల మాటున ఏమైనా వండర్ జరిగిందేమోనన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
పోల్ స్ర్కీన్ల కథ కంచికేనా?
పీఎన్‌బీఎస్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద కూర్చునే ప్రయాణికులకు వినోదాన్ని, బస్సుల సమాచారాన్ని తెలిపేందుకు పోల్స్ దగ్గర మినీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 60 స్ర్కీన్లు. వీటి నిర్వహణను గతంలో యూనీ యాడ్స్‌కే అప్పగించారు. అప్పట్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడప్పుడూ అవి మూలన పడటం, వాటిలో కొన్ని అపహరణకు గురవడం పెద్ద సంచలనంగా మారింది. చివరికి దొంగలను ఎలాగో కనిపెట్టారు. యూనీ యాడ్స్‌తో గడువు తీరి చాలా రోజులవుతోంది. అదే సంస్థకు గడువును పొడిగించవచ్చు. ఆ పని కూడా జరగలేదు. ఆ సంస్థకు బిగ్ స్ర్కీన్ల నిర్వహణ మీద ఉన్న ఆసక్తి పోల్ స్ర్కీన్ల మీద లేకపోవడం ఇందుకు కారణమై ఉండొచ్చు. ఇప్పుడు మరేదైనా సంస్థ ఈ స్ర్కీన్లను తామే ఏర్పాటుచేసి నిర్వహిస్తామని ముందుకు వస్తే వీటిని కూడా ఆర్టీసీ పక్కన పెట్టేస్తుందా? అలా చేస్తే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.
Updated Date - 2020-10-03T17:17:06+05:30 IST