ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2020-03-16T10:40:28+05:30
ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: ఎన్నికల నిర్వహణ కన్నా ప్రజారోగ్యమే ముఖ్యమని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, రౌడీయిజం మితిమీరిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులను వాడుకుని పోలీసుల సాయంతో టీడీపీ అభ్యర్థులను భయపెడుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయించి టీడీపీ అభ్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు, డీఎస్పీలపై ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించడం శుభ పరిణామమన్నారు. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి సహకరిస్తే మంచిగా పనిచేస్తోందని చెబుతున్నారని, సహకరించకుంటే చెడుగా ప్రచారం చేస్తున్నారని రవీంద్ర విమర్శించారు.
కులం రంగు పులుముతారా?
ఐఏఎస్ అధికారులకు కులం రంగు పులుముతున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించకుంటే 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5,800 కోట్లు రావని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హైరానా పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఇప్పటి వరకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు.
పేర్ని నాని స్థాయికి మించి మాట్లాడుతున్నారు
మంత్రి పేర్ని నాని తన స్థాయిని మించి ఎన్నికల కమిషనర్‌పై విమర్శలకు దిగుతున్నారని రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా డివిజన్లను విభజించారని ఆయన విమర్శించారు. ఒక డివిజన్‌లో 1,500 ఓట్లు ఉంటే మరో డివిజన్‌లో 4,200 ఓట్లు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు.
మచిలీపట్నానికి పేర్ని నాని వైరస్ సోకింది
తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెరవెనుక మంత్రి పేర్ని నాని కుట్రలు చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నానికి పేర్ని నాని వైరస్ సోకిందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ అభ్యర్థులను అనేక ప్రలోభాలు, భయబ్రాంతులకు గురి చేసిన మంత్రి నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
Updated Date - 2020-03-16T10:40:28+05:30 IST