బెంజ్-2 స్పీడ్
ABN, First Publish Date - 2020-12-05T05:51:17+05:30
బెంజ్-2 స్పీడ్
45 రోజుల్లోనే పిల్లర్ల పనులు ప్రారంభం
మొత్తం ఐదు పిల్లర్లకు శ్రీకారం
మరో 13 పిల్లర్ల నిర్మాణ పనులు చకచకా
గడ్డర్ల నిర్మాణ పనుల్లోనూ వేగం
విజయవాడ, ఆంధ్రజ్యోతి : బెంజిసర్కిల్-2 ఫ్లై ఓవర్ నిర్మాణంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. నెల రోజుల్లోనే భూ ఉపరితలంపై పిల్లర్ల నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా శ్రీకారం చుట్టింది. ట్రెండ్‌సెట్ మాల్ ఎదురుగా, జ్యోతి కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా రెండు దశల్లో భూమిపై పిల్లర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కేవలం నెలలోపే మూడొంతుల మేర భూగర్భ పిల్లర్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థ సమాంతరంగా భూగర్భ పిల్లర్ల తలలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో నెలలోపే ఈ భూగర్భ పిల్లర్ల తలలపై కూడా భూ ఉపరితల పిల్లర్లకు శ్రీకారం చుట్టడం విశేషం. వారంలో వీటి కాంక్రీట్ పనులు కూడా చేపట్టనున్నారు. ఈలోపే సగానికి పైగా పిల్లర్ల నిర్మాణానికి వీలుగా ఐరన్ ఫ్రేమ్ జాలీలను ఏర్పాటు చేయనున్నారు. భూమి పై భాగంలో పిల్లర్లను ఏర్పాటు చేయటానికి బెంజ్-1కు ఏడాది సమయం పడితే, బెంజ్-2కు మాత్రం రెండో నెల ప్రారంభంలోనే అంకురార్పణ జరగటం విశేషం.
45 రోజుల్లో వేగంగా..
భూగర్భంలో మొత్తం 224 పిల్లర్లు వేయాల్సి ఉండగా, నెల రోజుల వ్యవధిలోనే 176 పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తి చేయటం విశేషం. ఈ భూగర్భ పిల్లర్లను జాయింట్ చేస్తూ భూగర్భంలోనే తలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 58 తలలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 18 తలల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటిపై పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎస్వీఎస్ జంక్షన్ దగ్గర మూడు పిల్లర్లు, ట్రెండ్‌సెట్ ఎదురుగా రెండు పిల్లర్లకు శ్రీకారం చుట్టారు.
క్యాస్టింగ్ యార్డులో గడ్డర్ల నిర్మాణం
గడ్డర్ల నిర్మాణాన్ని కూడా కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా సమాంతరంగా ప్రారంభించటంతో పాటు వేగంగా పూర్తిచేస్తోంది. చిన్న అవుటపల్లి దగ్గర ఏర్పాటుచేసిన క్యాస్టింగ్ యార్డులో వీటి పనులు జరుగుతున్నాయి. మొత్తం పిల్లర్లపై 224 గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే 45 గడ్డర్ల పనులు పూర్తిచేశారు.
Updated Date - 2020-12-05T05:51:17+05:30 IST