53 రోజులు జైల్లో ఉంచినా ఇంకా మీ కక్ష తీరలేదా?
ABN, First Publish Date - 2020-12-05T06:00:53+05:30
మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అక్రమంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారని, అయినా కక్షతీరక మళ్లీ మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నా రంటూ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా తీవ్రంగా ధ్వజమెత్తారు.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 4 : మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అక్రమంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారని, అయినా కక్షతీరక మళ్లీ మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నా రంటూ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో విచారించేందుకు కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దేవినేని ఉమా రవీంద్రను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని దాడి కేసులో రాష్ట్ర ప్రభు త్వమే ముద్దాయని అన్నారు. టీడీపీ 25ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలపై ఎప్పుడూ తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపలేదని, కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ఏమాత్రం సంబంధం లేని కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అక్రమంగా విచారించేందుకు పోలీసు స్టేషన్‌కు పిలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పేర్ని నానిపై దాడిని అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా ఖండిస్తున్నారన్నారు. ఇసుక సమస్యతోనే పేర్ని నానిపై భవన నిర్మాణ కార్మికుడు దాడికి పాల్పడి ఉండవచ్చన్నారు. ఇసుక మాఫియాకు పాల్పడిన నేతలందరికీ పోలీ సులు 91 నోటీసులు ఇవ్వాలన్నారు. జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో నిందితుడిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు చెందిన కొల్లు రవీంద్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో అడ్డుపడేందుకు వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కొల్లు రవీంద్ర తన కుమారుడికి ఫిజియో థెరపీ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాఇ్స ఉందని, పోలీసుల వేధింపులతో వెళ్లలేకపోయార న్నారు. ఎస్పీతో తాను, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడామన్నారు.
మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మంత్రిపై దాడికేసులో రవీంద్రకు 91 నోటీసులిచ్చారని, దానికి ఆయన జవాబు కూడా ఇచ్చారన్నారు. మాజీ మంత్రి అయిన రవీంద్రను స్టేషన్‌కు పిలిపించనక్కరలేదని, ఏదైనా విచారణ చేయాలంటే ఇంటికి వచ్చి విచారణ జరపవచ్చన్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మా ట్లాడుతూ మంత్రి పేర్ని నానిపై దాడికేసులో ఏవైనా ఆధారాలుంటే తెలియజేయాలని నోటీసు ఇచ్చారని, దానికి జవాబు ఇచ్చానన్నారు. మళ్లీ ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు నోటీసు ఇచ్చారన్నారు. దాడితో తనకు సంబంధం లేదని, పోలీసులకు సహకరిస్తామని చెప్పామని, చెప్పినా పోలీసులు తనను వేధిస్తున్నారన్నారు. సంబంధం లేని కేసులో మళ్లీ ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T06:00:53+05:30 IST