ట్రైల్ సక్సెస్
ABN, First Publish Date - 2020-12-29T07:02:32+05:30
జిల్లాలో సోమవారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించారు.
ఐదు సెంటర్లలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో సోమవారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించారు. కరోనా టీకా త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ‘కొ-విన్’ వెబ్ పోర్టల్ ఆధారంగా ప్రజలందరికీ దశలవారీగా టీకా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి జిల్లా అధికారులు సోమవారం ఐదు చోట్ల కొవిడ్ వ్యాక్సినేషన్‌పై డ్రై రన్ నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రకాష్‌నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్, నగరంలోని పూర్ణా హార్ట్ ఇన్‌స్టిట్యూట్, తాడిగడపలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని ప్రకాశ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ ఇంతియాజ్ డ్రై రన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మిగిలిన కేంద్రాల్లో డ్రై రన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఈ మాక్‌డ్రిల్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి సెంటర్లో మూడు గదులు ఏర్పాటు చేశారు. ఒక గదిలో రిజిస్ట్రేషన్, మరో గదిలో వ్యాక్సినేషన్, ఇంకో గదిలో అబ్జర్వేషన్ నిర్వహించారు. ‘కొ-విన్’ వెబ్ పోర్టల్‌లో ముందుగా అప్‌లోడ్ చేసిన లబ్ధిదారులకు డమ్మీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఐఆర్‌ఎల్ నుంచి కంప్యూటర్‌లో సమాచారం నమోదు చేశారు. అంతకుముందే మచిలీపట్నంలోని జిల్లా డ్రగ్ స్టోర్స్ నుంచి కోల్డ్ చెయిన్ పాయింట్లకు చేర్చారు. ఐదు కేంద్రాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రక్రియను చిత్రీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీహరి, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ శర్మిష్ట తదితర అధికారులు ఆయా కేంద్రాల్లో డ్రై రన్‌ను పర్యవేక్షించారు.
Updated Date - 2020-12-29T07:02:32+05:30 IST