కుల బహిష్కరణ చేస్తే పట్టించుకోరా?
ABN, First Publish Date - 2020-11-13T07:01:14+05:30
కుల బహిష్కరణ చేస్తే పట్టించుకోరా?
ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ను నిలదీసిన దళిత మహిళలు
తోట్లవల్లూరు, నవంబరు 12 : ‘గ్రామంలో రెండేళ్ల నుంచి కుల బహిష్కరణ ఎదుర్కొంటున్నాం. తప్పుడు కేసుతో ఓ యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం రాకుండా చేశారు. సంఘానికి వచ్చే ఆదాయాన్ని పెద్దలు దక్కకుండా చేస్తున్నారు. అంతా ఒకే కులస్తులమై ఉండి తాము ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణ సమస్యను మీకు రెండుసార్లు తెలిపాం. ఏ న్యాయం చేశారు..’ అంటూ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌ను తోట్లవల్లూరు శివారు కలాస్‌మాలపల్లి దళిత మహిళలు, యువకులు ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఎమ్మెల్యే అనీల్ గురువారం ఈ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. దీంతో బాధిత కుటుంబాలకు చెందిన అంబటి శ్రీను, తెలుగు నాని, పి.జ్యోత్స్న, ఎం.భవానీ, కె.వెంకటేశ్వరరావు, ప్రమీలారాణి తదితరులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించి గోడును తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమకు న్యాయం ఎప్పుడు చేస్తారంటూ వాదనకు దిగారు. కో ఆపరేటివ్ సొసైటీ భూములపై సంఘ పెద్దలు పెత్తనం చెలాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను కొద్దిరోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఎవ రూ గొడవలు పడవద్దని ఎమ్మెల్యే సర్దిచెప్పి వెళ్లిపోయారు. అంతకుముందు ఎమ్మె ల్యే వస్తున్నారని కుల బహిష్కరణ ఎదుర్కొంటున్న దళితులు ఆందోళనకు దిగారు.
ప్రశ్నించినందుకు దాడి
కలాస్‌మాలపల్లిలో ఓ కుటుంబంపై గురువారం రాత్రి ఎమ్మెల్యే అనీల్‌కుమార్ అనుచరులు దాడి చేశారు. సంఘ పెద్దలు తమ వర్గాన్ని కుల బహిష్కరణ చేశారని, తమకేం న్యాయం చేశారంటూ ప్రశ్నించిన వారిపై రాత్రి 9 గంటల సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మారుమూడి ధనలక్ష్మి, మారుమూడి కుమారి, సుబ్బారావుపై దాడికి పాల్పడగా, ఎస్‌ఐ ఎం.కిషోర్‌బాబు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి గురైన ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, ధనలక్ష్మిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-11-13T07:01:14+05:30 IST