కరోనా పరీక్షలు ప్రారంభం
ABN, First Publish Date - 2020-11-13T11:34:01+05:30
ఐమాస్క్ బస్సుల ద్వారా కరోనా పరీక్షలు చేసే ప్రక్రియ గురువారం పునఃప్రారంభమైంది. విజయవాడ రైల్వేస్టేషన్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గుణదలలోని మేరీమాత ఆలయం వద్ద బస్సులను నిలిపి ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించారు.
జిల్లావ్యాప్తంగా 10 బృందాలే అందుబాటులోకి..
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఐమాస్క్ బస్సుల ద్వారా కరోనా పరీక్షలు చేసే ప్రక్రియ గురువారం పునఃప్రారంభమైంది. విజయవాడ రైల్వేస్టేషన్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గుణదలలోని మేరీమాత ఆలయం వద్ద బస్సులను నిలిపి ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ బస్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా వీరా సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో పది రోజులుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. దీంతో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ప్రజలు, అనుమానితుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు వెలువడ్డాయి.
దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం కాంట్రాక్టు సంస్థ వీరా హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపడంతో గురువారం నుంచి ఐమాస్క్ బస్సుల ద్వారా శాంపిల్స్ సేకరించే ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. అయితే, గతంలో జిల్లావ్యాప్తంగా 50 బృందాలు పనిచేయగా, ప్రస్తుతం 10 బృందాలే అందుబాటులో ఉండటంతో రైల్వేస్టేషన్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గుణదలలోని మేరీమాత దేవాలయం వద్ద మాత్రమే బస్సులను నిలిపి ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితోపాటు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, నగరాల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రోజుకు 8వేలకు పైగా శాంపిల్స్ సేకరిస్తున్నారని, ఐమాస్క్ బస్సుల్లో పనిచేసే సిబ్బంది ఆందోళన విరమించి తిరిగి విధుల్లో చేరితే పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
Updated Date - 2020-11-13T11:34:01+05:30 IST