లాకప్ డెత్ మిస్టరీ
ABN, First Publish Date - 2020-10-04T09:48:45+05:30
ఈనెల 1వ తేదీన విజయవాడ ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు అజయ్, సాయికిరణ్‌తో పాటు ఎస్‌ఈబీ సిబ్బంది ఎవరెవరు ఉన్నారు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారణ సాగింది? పోలీస్ దెబ్బల కారణంగానే అజయ్ చనిపోయాడా? లేక మూర్చ వ్యాధితోనా? ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న చర్చ ఇది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఈనెల 1వ తేదీన విజయవాడ ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు అజయ్, సాయికిరణ్‌తో పాటు ఎస్‌ఈబీ సిబ్బంది ఎవరెవరు ఉన్నారు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విచారణ సాగింది? పోలీస్ దెబ్బల కారణంగానే అజయ్ చనిపోయాడా? లేక మూర్చ వ్యాధితోనా? ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న చర్చ ఇది.
పోలీస్ దెబ్బల కారణంగానే అజయ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ చేస్తుండగా, మూర్చ రావడంతో అజయ్ కింద పడిపోయాడని, అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడని ఎస్‌ఈబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు వాదనల్లో వాస్తవం ఏమిటిన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది.
ఆరోజు ఏం జరిగింది?
ఒకటో తేదీన అజయ్, అతడి స్నేహితుడు సాయికిరణ్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ముందుగా అజయ్‌ను విచారణ చేశారు. ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్‌తో పాటు మరో కానిస్టేబుల్ ఈ విచారణ చేసినట్టు సమాచారం. ముందుగా విచారణలో అజయ్‌కు ఒక దఫా పోలీస్ తరహా విచారణ ఇచ్చారని, అనంతరం అతడ్ని పక్కన కూర్చోబెట్టి సాయికిరణ్‌ను విచారణ చేస్తుండగా, అజయ్‌లో వణుకు పుట్టిందని తెలుస్తోంది.
ఆ సమయంలోనే అతడు కింద పడిపోయాడని సమాచారం. జీపులో ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికి అజయ్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు ఇద్దరినీ మధ్యాహ్నం రెండు గంటలకు స్టేషన్‌కు తీసుకొచ్చారని, సాయంత్రం ఐదు గంటలకు పంపేద్దామనేలోపు ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
విచారణ ప్రారంభం
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశించారు. విచారణాధికారిగా ‘దిశ’ పోలీస్‌స్టేషన్ ఏసీపీ వీవీ నాయుడును నియమించారు. ఆయన శనివారం నుంచి విచారణ ప్రారంభించారు. అజయ్ పోలీసుల దెబ్బలకే ప్రాణాలు కోల్పోయాడా, మూర్చ రావడంతో ఊపిరి ఆగిపోయిందా అన్నది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. వారంలో ఈ నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. విచారణలోని అంశాలను, పోస్టుమార్టం రిపోర్టును క్రోడీకరించి ఒక నివేదికను పోలీస్ కమిషనర్‌కు అందజేస్తారు. అనంతరం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - 2020-10-04T09:48:45+05:30 IST