మరణ భయం
ABN, First Publish Date - 2020-10-04T09:46:43+05:30
జిల్లాలో కాస్త తగ్గినట్టు కనిపించిన కరోనా మళ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. రోజూ 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఐదారు మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కాస్త తగ్గినట్టు కనిపించిన కరోనా మళ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. రోజూ 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ఐదారు మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో మొత్తం 162 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. జిల్లావ్యాప్తంగా 12,144 మంది వైరస్ బారినపడ్డారు. ఈ నెలలో కేవలం మూడు రోజుల్లోనే రోజుకు ఆరుగురు చొప్పున 18 మంది మరణించారు. 1,289 మందికి కరోనా సోకింది.
శనివారం ఒక్కరోజే 392 మంది వైరస్ బారిన పడ్డారు. ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 28,717కు చేరాయి. మరణాలు అధికారికంగా 458గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 345 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, 2,822 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల రికవరీల రేటు మెరుగుపడటం కాస్త ఊరటనిచ్చే అంశం.
మరో ఆరు కంటైన్మెంట్ జోన్లు
జిల్లాలో మరో ఆరు కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రకటించారు. నాగాయలంక మండలంలోని సొర్లగొండి, నందిగామ మండలంలోని కంచల, కంచికచర్ల మండలంలోని కీసర, వీరులపాడు మండలంలోని జగన్నాథపురం, వత్సవాయి మండలంలోని దేచుపాలెం, ఆగిరిపల్లి మండలంలోని వట్టిగుడిపాడు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు.
Updated Date - 2020-10-04T09:46:43+05:30 IST