ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలవరపడకండి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ABN, First Publish Date - 2020-03-03T10:53:07+05:30

చైనాలో వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతోంది. చైనా నుంచి దేశ దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కలవరం

ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా?

భయంతో వణికిపోతున్న జనం 

నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం     

                                                                              విజయవాడ(ఆంధ్రజ్యోతి): చైనాలో వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతోంది. చైనా నుంచి దేశ దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి ఢిల్లీ, హైదరాబాదులకూ చేరిందని సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమే అధికారికంగా ప్రకటించడంతో తెలుగు ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాదుల్లో రెండు కరోనా వైరస్‌ కేసులు మాత్రమే నమోదైనట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయినా ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి అతి వేగంగా సోకుతుండటంతో రాజధాని జిల్లాల్లోనూ కలవరం మొదలైంది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ ఇక్కడకు కూడా వ్యాపిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇక్కడి యంత్రాంగం సిద్ధంగా ఉందా? అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


విజయవాడ, మచిలీపట్నంలో ప్రత్యేక వార్డులు.. 

దాదాపు రెండు నెలల నుంచి కరోనా వైరస్‌ ప్రకంపనలు పుట్టిస్తుండటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరైనా వస్తే వారిని ఈ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించేందుకు వైద్యులను, సిబ్బందిని నియమించి, వారికి మాస్కులు, ప్రొటెక్షన్‌ కిట్లు, అవసరమైన మందులు కూడా సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరూ రాకపోవడంతో ఈ ప్రత్యేక వార్డుల్లో ప్రస్తుతం సాధారణ రోగులకు కూడా వైద్యసేవలందిస్తున్నారు. 


ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు 

విదేశాల నుంచి జిల్లాకు వస్తున్నవారిలో ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలుంటే గుర్తించేందుకు విజయవాడ విమనాశ్రయంలో ప్రత్యేక స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోంది.


వ్యాధి లక్షణాలు ఇవి..

ప్రాణాంతక న్యూమోనియాకు కారణమయ్యే కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు జలుబుతో ముక్కు కారటం, గొంతునొప్పి, పొడిదగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వికారం, వాంతులు, విరేచనాలు తదితర అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఒంటెలు, పిల్లులు, గబ్బిలాల ద్వారా కరోనా వైరస్‌ మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఇతరులతో కరచాలనం చేసినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. గుండె, కిడ్నీ, షుగరు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి, చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ కరోనా వైరస్‌ సోకితే వారిలో వ్యాధి నిరోధకశక్తి మరింత వేగంగా తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి.


ముందు జాగ్రత్తలే శరణ్యం

  • - కరోనా వైరస్‌ నిర్మూలనకు నిర్దిష్టమైన చికిత్స లేదు. ఈ వైరస్‌ బారినపడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి. 
  • వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. 
  • జనసమ్మర్థంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. తప్పనిసరైతే మాస్కులు ధరించాలి. 
  • తుమ్మినా, దగ్గినా, కర్చీఫ్‌ను అడ్డు పెట్టుకోవాలి. 
  • సబ్బు, లేదా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ రబ్‌తో చేతులను తరచూ కనీసం 20 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలి. 
  • కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 

అవగాహన కార్యక్రమాలేవీ? 

జిల్లాలోని రెండు ఆసుపత్రుల్లో రెండు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం, ఎయిర్‌పోర్టులో స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోనే తమ పని పూర్తయిపోయిందన్నట్లు అధికారులు వ్యవహరించడం తగదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో ఉన్న భయాందళనలు తొలగించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అవగాహన కార్యక్రమాలను  ప్రభావవంతంగా నిర్వహించేలా చూసేందుకు జిల్లాకు ప్రత్యేకంగా ఒక నోడల్‌ అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. అయినా జిల్లాలో ఎక్కడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మేల్కొని కరోనా వైరస్‌ ప్రబలకుండా ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 


అంతా సిద్ధంగా ఉన్నాం 

జిల్లాలో కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు ఇంతవరకు ఏమీ లేవు. అయినా అన్ని విధాలుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని డాక్టర్లను, పారామెడికల్‌ సిబ్బందిని అలెర్ట్‌ చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ముద్రించి ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశాం. విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారికి స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహించేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక వైద్యశిబిరాన్ని కొనసాగిస్తున్నాం. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. వైద్యులకు అవసరమైన మాస్కులు, ఇతర ఎక్విప్‌మెంట్‌ను సరఫరా చేశాం. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి గుంటూరులోని ఫీవర్‌ ఆసుపత్రిలో కరోనా వైరస్‌కు చేయాల్సిన చికిత్స విధానం గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి మన జిల్లా నుంచి కూడా కొంతమంది వైద్యాధికారులు, సిబ్బందిని పంపించాం. 

- డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి, డీఎంహెచ్‌వో 

Updated Date - 2020-03-03T10:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising