ఆంధ్రా బ్యాంకు కనుమరుగు
ABN, First Publish Date - 2020-03-31T15:53:40+05:30
ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా..
యూనియన్ బ్యాంకులో విలీనం రేపు
మచిలీపట్నం(కృష్ణా): ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా ఆంధ్రా బ్యాంకు విలీనం ఆగలేదు. యూనియన్ బ్యాంకులో బుధవారం ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో 1923లో స్థాపించిన ఆంధ్రా బ్యాంకు దేశ విదేశాల్లో విస్తరించినప్పటికీ కేంద్రం నిర్ణయంతో కార్పొరేషన్ బ్యాంకులో విలీనమవుతోంది. విలీనం పట్ల బ్యాంకు డైరెక్టర్ బంధువులు, బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరని అన్యాయం: దొరెడ్ల హేమప్రకాష్, రిటైర్డు ఉద్యోగి, ఆంధ్రాబ్యాంకు
ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడిచాయి. అయినప్పటికీ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంతో బ్యాంకులు విలీనం చేస్తున్నారు. బందరు ప్రజలు గర్వంగా చెప్పుకునే ఆంధ్రాబ్యాంకు పేరు మారిపోవడం దురదృష్టకరం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆశయాలకు అనుగుణంగా బ్యాంకు అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వేలాది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇస్తున్న పట్టాభి గ్రామీణాభివృద్ధి సంస్థను కొనసాగించాలి. పట్టాభి లైబ్రరీని బలోపేతం చేయాలి. ప్రతి యేటా పట్టాభి సీతారామయ్య జయంతులు, వర్ధంతులు నిర్వహించాలి. బ్యాంకు లాభాల్లో ఉన్నప్పటికీ యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం దురదృష్టకరం.
Updated Date - 2020-03-31T15:53:40+05:30 IST