ఇది వికృత క్రీడ
ABN, First Publish Date - 2020-09-14T08:45:04+05:30
రాజధానిపై రాజకీయ పార్టీలు వికృత క్రీడ ఆడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని రైతులు మండిపడ్డారు.
గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడేపల్లి, మంగళగిరి క్రైమ్, తాడికొండ, తెనాలి అర్బన్, సెప్టెంబరు 13: రాజధానిపై రాజకీయ పార్టీలు వికృత క్రీడ ఆడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని రైతులు మండిపడ్డారు. అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 271వ రోజుకు చేరాయి. రాయపూడిలో కులమతాలకు అతీతంగా పోలేరమ్మకు చీర, సారె సమర్పించి అమరావతిని కొనసాగించేలా చూడాలని పూజలు చేశారు.
అనంతవరంలో ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించిన రైతులు వేంకటేశ్వరస్వామికి పొంగళ్లు పెట్టారు. మందడంలో జరిగిన పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరై రైతులకు మద్దతు తెలిపారు. నీరుకొండ, బోరుపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెదపరిమి శిబిరాల్లో హనుమాన్ చాలీసా పఠించి పూజలు చేశారు.
వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్కడే ధైర్యవంతుడని ఉద్దండ్రాయునిపాలెం రైతులు, మహిళలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని తాడేపల్లి మండలం పెనుమాక, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు ఎలుగెత్తి చాటారు.
Updated Date - 2020-09-14T08:45:04+05:30 IST