పశుపోషకులకూ కిసాన్‌కార్డులు
ABN, First Publish Date - 2020-12-11T07:29:58+05:30
రైతులకు ఇచ్చినట్టే, రాష్ట్రంలోని పశు పోషకులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు.
పశువుల పంపిణీతో మహిళలకు మేలు
సాగుబడికి పాడి తోడైతే కరువు దూరం
అమూల్, చేయూత, ఆసరా తరహాలోనే
‘జగనన్న జీవక్రాంతి’ అమలు: జగన్
పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇచ్చినట్టే, రాష్ట్రంలోని పశు పోషకులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొన్నవారికి ఈ కార్డులు ఉపయోగపడతాయని చెప్పారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌విధానంలో రూ.1,860కోట్ల విలువైన 2.49లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే ’జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ‘‘గత ప్రభుత్వాలు వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని ఏనాడూ భావించలేదు. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటుందనేందుకు అమూల్‌తో ఒప్పందం, చేయూత, ఆసరా పథకాలు, అక్కచెల్లెమ్మలకు మేకలు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలే చక్కని నిదర్శనాలు’’ అని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. జగనన్న జీవ క్రాంతి పథకం అత్యంత తృప్తినిచ్చే పథకాల్లో ఒకటన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ఇలాంటివి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. అక్కాచెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. వారి ముఖాల్లో సంతోషం నిలిచిఉండేలా కృషి చేస్తున్నాం. 31లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా వారిపేరుతోనే రిజస్ట్రేషన్ చేస్తాం’’ అని తెలిపారు. వ్యవసాయంతోపాటు పశువుల పెంపకం చేపడితే రైతు కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందన్నారు. ‘‘అమూల్‌తో ఒప్పందంలో భాగంగా రూ.3,500కోట్ల విలువైన 4.69లక్షల ఆవులు, గేదెల యూనిట్లు మహిళలకు అందిస్తాం. గతవారం ఏడువేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆగస్టు తర్వాత 3.69లక్షల యూనిట్లు పంపిణీ చేస్తాం. అలాగే 1,51,671 గొర్రెలు, 97,480యూనిట్ల మేకల పంపిణీ చేస్తాం. మూడు దశల్లో వీటిని అందిస్తాం. కరువుకాటకాలు వచ్చినా రైతుల కుటుంబాలను ఇవి ఆదుకుంటాయి’’ అని జగన్ తెలిపారు. వ్యాపారంలో తప్పనిసరిగా లాభాలు వచ్చేలా అమూల్, రిలయన్స్, పీ అండ్ జీ, హెచ్‌ఎల్‌ఎల్, అల్లానా వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘అల్లానా గ్రూప్ తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మాంస శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేస్తుంది.
డోన్, పెనుగొండలో గొర్రెల పెంపకం కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇస్తాం’ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు గొంగడికప్పి, తాటిఆకులతో తయారుచేసిన గొడుగు, మేకపిల్లను లబ్ధిదారులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
17న బీసీ సంక్రాంతి
ఈ నెల 17న బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ‘బీసీ సంక్రాంతి’ పేరుతో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్‌పర్సన్‌లు, డైరక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలిపారు.
కార్డుల తొలగింపు అవాస్తవం: కొడాలి
గుడివాడ, డిసెంబరు 10: ‘‘అర్హతే ప్రామాణికంగా బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో 10 లక్షల కార్డులు తొలగించినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నిత్యం సీఎం జగన్మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే ధ్యేయంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’’ అని పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ నవశకం ద్వారా ప్రభుత్వం 10 నెలల కిందట బియ్యం కార్డుకు అర్హులను గుర్తించిందన్నారు. ప్రస్తుతం కోటి 44 లక్షల 26 వేల 595 కార్డుల్లో 4,22,93,348 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని విశదీకరించారు. అర్హతున్నవారు వార్డు వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో బియ్యం కార్డు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని బియ్యం కార్డుదారులకు జనవరి 1 నుంచి డోర్ డెలివరీ పద్ధతిలో రేషన్ అందజేస్తామని మంత్రి చెప్పారు.
Updated Date - 2020-12-11T07:29:58+05:30 IST