బీజేపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట
ABN, First Publish Date - 2020-09-14T10:53:48+05:30
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో బలపడి, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
రాష్ట్ర కార్యదర్శిగా నాగోతు రమే్‌షనాయుడు
కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా శశిభూషణ్‌రెడ్డి
బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
సీఎం సొంత జిల్లాలో బలపడేందుకు బీజేపీ వ్యూహం
(కడప-ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ సొంత జిల్లా కడపలో బలపడి, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. ఏ జిల్లాకు దక్కని విధంగా కీలకమైన మూడు పదవులు కేటాయించారు. సీనియారిటీని, యువ నాయకత్వాన్ని సమపాళ్లలో చూస్తూ రాష్ట్ర కమిటీలో జిల్లాకు అవకాశం కల్పించారు సోము వీర్రాజు.
ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి బాధ్యత అప్పగించారు. యువమోర్చాలో కీలకంగా ఉన్న రాజంపేటకు చెందిన నాగోతు రమే్‌షనాయుడును పార్టీలోకి తీసుకుని, రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. జిల్లాలో సీనియర్ నాయకుడు సీఎం సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన శశిభూషణ్‌రెడ్డికి కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. మొత్తంగా జిల్లాలో బలపడేందుకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన కమిటీలో కీలక స్థానమే కల్పించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో బలమైన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణరెడ్డికి రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం కల్పించారు సోము వీర్రాజు. 30 ఏళ్లుగా రాజకీయ జీవితంలో రాణిస్తున్న ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా 2001లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జమ్మలమడుగు అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశారు. వార్డు మెంబరు నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టే స్థాయి ఎదిగారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. చంద్రబాబు క్యాబినెట్‌లో కీలక మంత్రి బాధ్యతలను చేపట్టారు.
2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడటం, రాష్ట్రంలో టీడీపీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. పార్టీలో చేరి ఏడాది కాలంలో జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆదినారాయణరెడ్డికి కీలకమైన ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. రాష్ట్ర, జాతీయ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని, తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని ఆదినారాయణరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
యువమోర్చా నుంచి పార్టీ కార్యదర్శిగా రమే్‌షనాయుడు
రాజంపేటకు చెందిన నాగోతు రమే్‌షనాయుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి దశలో ఏబీవీపీ సామాన్య కార్యకర్తగా అడుగులు వేసిన రమే్‌షనాయుడు అంచలంచెలుగా ఎదిగారు. విద్యార్థి నాయకుడిగా విద్యార్థి విభాగం యువమోర్చలో కీలక బాధ్యతలు చేపట్టారు. రాజంపేట డిగ్రీ కళాశాల యూనియన్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో ఏబీవీపీ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏబీవీపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన ఆదిష్ఠానం 2007లో యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా కర్నాటక యూత్‌వింగ్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యతతో పాటు సీఎం సొంత జిల్లాలో పటిష్ఠమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా ఆయనకు రాష్ట్ర కార్యదర్శ పదవి అప్పగించారు.
విద్యార్థి నాయకుడిగా ఉంటూ మేజర్ గ్రామ పంచాయతీ కూచివారిపల్లె సర్పంచ్‌గా ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. రాజంపేట మండలం బసినాయుడుగారిపల్లెకు చెందిన రమే్‌షనాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ ఇటు పార్టీలోను, అటు ఆర్‌ఎ్‌సఎస్ కార్యక్రమాల్లోను కీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యత గల సైనికుడిగా పనిచేస్తానని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
రైతుబిడ్డకు కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవి
సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని సింహాద్రిపురం మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన రైతుబిడ్డ శశిభూషణ్‌రెడ్డికి రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్ష పదవి వరించింది. 1994 నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. 1996-98 వరకు సింహాద్రిపురం పార్టీ మండల అధ్యక్షుడిగా, 2000-13 వరకు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 2009-11 వరకు కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011-15 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.
Updated Date - 2020-09-14T10:53:48+05:30 IST