ఉద్యోగం రాక ‘కష్టాల్లో’ మునక!
ABN, First Publish Date - 2020-02-24T11:42:22+05:30
పెన్నా నది జల పరవళ్లు.. ఆ పక్కనే పచ్చని పైర్లతో కళకళలాడే పంట చేలు.. పొలంగట్లపై లేగ దూడల
భూములిచ్చి.. బువ్వకులేక రోడ్డున పడ్డాం
ఉద్యోగాలు ఇస్తామని జీవో నెం.98
9,751 మందితో ప్రభుత్వానికి అర్హుల జాబితా
జాబితాలో ఎన్నో లోపాలు..?
సోమశిల జలాశయం ముంపు గ్రామాల రైతుల కన్నీటి వ్యథలెన్నో
కడప, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాలం కరిగిపోతోంది.. ఏళ్లకు ఏళ్లు దాటిపోతున్నాయి. ఉద్యోగాల్లో రిటైర్మెంట్ తీసుకునే వయసూ వచ్చింది. అయినా వీరికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లు ఆశగా ఎదురుచూసి.. చూసి.. చనిపోయిన వారూ ఉన్నారు. ఉన్న ఊళ్లు నీట మునిగాయి. పంటగింజలు పండుతూ పచ్చగా కళకళలాడే పొలాలు జలమయమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారం హారతి కర్పూరంలా కరిగిపోయింది. పదుగురికి అన్నం పెడుతూ దర్జాగా బతికిన రైతన్నలు నేడు.. ప్రభుత్వం దిక్కు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. సోమశిల ముంపు జలాలతో సర్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగాలు దక్కని అభాగ్యులెందరో..
పెన్నా నది జల పరవళ్లు.. ఆ పక్కనే పచ్చని పైర్లతో కళకళలాడే పంట చేలు.. పొలంగట్లపై లేగ దూడల పరుగులు.. ఊరూరా పాడిదారలు! ఆనందంగా సాగిపోయే ఆ పల్లె సీమల రైతుల గుండెల్లో సోమశిల జలాశయం రూపంలో పిడుగు పడింది. జీవనాధారమైన పంట పొలాలు.. నీడనిచ్చే ఇళ్లు ముంపునకు గురయ్యాయి. జలాశయం దిగువ గ్రామాలకు పచ్చగా ఉండాలని భూములు త్యాగం చేశాం.. సర్కారోళ్లు ఇచ్చిన అరకొర పరిహారంతో ఊళ్లు వదిలాం.. మాకు జీవనాధారం ఏమిటీ..? రైతుల ప్రశ్నలివి. ఉద్యోగాలు ఇస్తామని జీవో ఎంస్ నెం.98 జారీ చేశారు. ఈ జీవో ఒకటుందని.. ఉద్యోగాలు వస్తాయని అక్షర జ్ఞానం లేని అమాయక రైతులకు తెలియదు. ఈలోగా 320 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వారిలో అర్హులెందరో.. అనర్హులెందరో..? అధికారులకే ఎరుక. 116 ముంపు గ్రామాలకు చెందిన 9,751 మంది అర్హుల జాబితాతో జిల్లా కమిటీ ప్రభుత్వానికి పంపింది. వారికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు. కొందరికి వయస్సు మళ్లిపోతుంది. ఇప్పటికైనా కరుణించడయ్యా..! భూములిచ్చి.. బువ్వకు లేక బతుకు భారమై రోడ్డున పడ్డామని కన్నీరు పెడుతున్నారు. సోమశిల జలాశయం ముంపు గ్రామాల రైతుల కన్నీటి వ్యథలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
నెల్లూరు జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా పెన్నా నదిపై అనంతసాగర్ దగ్గర సోమశిల జలాశయం నిర్మించారు. 1976లో చేపట్టిన ఈ రిజర్వాయరు గరిష్ట నీటి మట్టం 330 మీటర్లు. సామర్థ్యం 78 టీఎంసీలు. జల ప్రయోజనాలు నెల్లూరు జిల్లాకు అయితే.. కడప జిల్లాలో గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, నందలూరు మండలాల పరిధిలో 116 గ్రామాలు, 62 వేల ఎకరాల సాగు భూములు ముంపునకు గురయ్యాయి. 1988-89లో నిర్మాణం పూర్తి అయ్యింది. 1983 నుంచే గ్రామాలను ఖాళీ చేయించారు. అప్పట్లో పక్కా ఇంటికి రూ.1,200-5,000, గుడిసెకు రూ.900-1,500, సాగు భూమి ఎకరాకు రూ.2 వేల నుంచి 8 వేల దాక పరిహారం ఇచ్చారు.
ఉద్యోగాల జీవోలపై అవగాహన లేక
సోమశిల ముంపు రైతు కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని 1978 నవంబర్ 17న ఒక జీవో, రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణాల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వాలని 1986 ఏప్రిల్ 15న ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 1986 నుంచి 2004 దాక ఉద్యోగాల కోసం అర్హులైన నిర్వాసిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మాస్టర్ రిజిస్టర్ ప్రకారం 1,014 ధరఖాస్తులు వచ్చాయి. సీనియార్టీ జాబితా తయరు చేసి వివిద దఫాలుగా 320 ముందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో చాలామంది అనర్హులు ఉన్నారని ఆరోపణ. ఇలాంటి జీవో ఉందని, తమకు ఉద్యోగం వస్తుందని సోమశిల రిజర్వాయర్ నిర్వాసితులకు చాలామందికి తెలియదు. కారణం నిరక్షరాస్యత. అయితే నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తుండడంతో మిగిలిన రైతులు కూడా మేల్కొని మాకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు.
ఐదేళ్లుగా నిరీక్షణ
నిర్వాసిత రైతుల కుటుంబాల్లో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు 2014 జనవరి 25న నాటి కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. నిర్వాసితులను గ్రామం ముందుగా ఖాళీ చేసిన రైతులు, ఇల్లు, భూములు కోల్పోయిన రైతులు, భూములు మాత్రమే కోల్పోయిన రైతులు, ఇల్లు ఒక్కటే కోల్పోయిన వారు, ఇంట్లో ఉద్యోగులు లేని వారు.. ఇలా ఐదు ప్రాధాన్యతలుగా విభజించి దరఖాస్తులు స్వీరిస్తే 14,554 మంది రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రాధాన్యత ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ 9,751 సీనియార్టి జాబితా తయారు చేసి 2015 జూన్ 18న ప్రభుత్వానికి పంపారు. ఆ జాబితాను మరోసారి పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వాలని మెలిక పెట్టారు.
అయితే.. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా సెలక్షన్ కమిటీ పంపిన సోమశిల నిర్వాసితుల ఉద్యోగ అర్హుల జాబితాలో సగానికిపైగా అనర్హులు ఉన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు లేకపోలేదు. ఇరిగేషన్ సీఈ కార్యాలయం నుంచి నెల్లూరు ఎస్‌ఈ కార్యాలయానికి ఈ ఫైలు వచ్చింది. ఇప్పటి వరకు 9 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. వేలాది మంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం నిరీక్షస్తున్నారు. కొందరికి కనీస అర్హత వయస్సు దాటిపోయింది. మా పిల్లలకైనా ఇవ్వండి. భూములిచ్చి మాకు బతుకు చూపండి.. అంటూ కన్నీరు పెడుతున్నారు.
ఎనిమిది ఎకరాల భూమి కోల్పోయాం
మా నాన్న పెద్ద పిచ్చయ్య పేరున ఎనిమిది ఎకరాల పొలం ఉంది. నాలుగు నివాస గుడిసెలు ఉండేవి. సోమశిల ప్రాజెక్టు మా బతుకును ఛిద్రం చేసింది. ఇల్లు, చేలు నీటమునిగాయి. 1979లో అవార్డుచేసి ఎకరాకు రూ.4వేలు మాత్రమే ఇచ్చారు. నివాస ఇంటికి రూ.72వేలు ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమి కొందామంటే ఎకరాకు రూ.15లక్షలు అయినా రాదు. పొలాలు పోయాయి, ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపమని జీవో 98 కింద 1998లో దరఖాస్తు చేస్తే 2004 అప్రూవల్ జాబితాలో పేరు లేదు. మళ్లీ దరఖాస్తు చేశాను. సీనియారిటీ జాబితాలో మొదట్లోనే ఉన్నా ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. నా వయసు 50 ఏళ్లు. నా బదులుగా నా కూతురికైనా ఉద్యోగం ఇవ్వాలి.
- ఉప్పలపాటి వెంకటసుబ్బయ్య, ఓబులం గ్రామం, గోపవరం మండలం
ఉద్యోగం రాకుండానే తమ్ముడు చనిపోయాడు..
పెన్నానది ఒడ్డున రెండు ఎకరాల పొలం ఉంది. పసుపు, వరి వంటి పంటలు సాగు చేస్తూ ఆనందంగా జీవించేవాళ్లం. నేను, తమ్ముడు ఈశ్వరయ్య, ఇద్దరు చెల్లెళ్లు రత్నమ్మ, పద్మావతి, అమ్మానాన్నలు కృష్ణయ్య, యానాదమ్మ.. ఇదీ మా కుటుంబం. సోమశిల జలాశయం నిర్మాణంలో 15 అంకణాల గుడిసె, రెండు ఎకరాల పొలం ముంపునకు గురైంది. ఎకరాకు రూ.1500 చొప్పున రెండు ఎకరాలకు రూ.2600 ఇచ్చారు. ఇంటికి రూ.25,500 ఇచ్చారు. ఆ డబ్బు ఎప్పుడో ఖర్చయిపోయింది. జీవోఎంఎస్ 91 ప్రకారం ఉద్యోగం కోసం మా తమ్ముడు దరఖాస్తు చేసినా ఉద్యోగం రాకుండానే చనిపోయాడు. నేను దరఖాస్తు చేశాను. 2018 డిసెంబరు 31న ఉద్యోగం వచ్చిందని చెప్పారు. కానీ ఉద్యోగం ఇవ్వలేదు. నా వయసు 58 ఏళ్లు దాటింది. నా కొడుకు టి.రామ్మోహన్‌కు మార్చాం. సీనియారిటీ జాబితాలో 57వ నెంబరు మాది. ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. భూమిచ్చి రోడ్డున పడ్డాం. దిక్కులేక బతుకు భారమై దిక్కులు చూస్తున్నాం.
- తెల్లగొల్ల వెంకటస్వామి, సోమశిల నిర్వాసిత రైతు, చిన్నపరెడ్డిపల్లె, ఒంటిమిట్ట మండలం
అవార్డు రైతులకే ఉద్యోగాలివ్వాలి
సోమశిల జలాశయం నిర్వాసితులకు ఉద్యోగాల విషయంలో దళారులు రంగప్రవేశం చేసి అర్హులకు అన్యాయం చేస్తున్నారు. 2015లో ప్రభుత్వానికి వెళ్లిన సీనియర్ జాబితాలో సగం మందికి పైగా అనర్హులే ఉన్నారు. వారి నుంచే మేమంతా నష్టపోతున్నాం. రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో భూములు కోల్పోయి అవార్డు పొందిన రైతుల జాబితా ఉంది. ఆ ఇండెక్స్ ఆధారంగా ఎంక్వయిరీ చేసి జీవో ఎంఎస్ నెం98 ప్రకారం నిజమైన రైతులకు ఉద్యోగాలివ్వాలి. ముంపునకు గురైన గ్రామాల వారికి కాకుండా.. ముంపునకు గురికాని గ్రామాల వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయంటే నిజమైన అర్హులకు అన్యాయం ఎలా జరిగిందో ఇట్టే తెలుస్తుంది.
- మీసాల రవి, సూరేపల్లె, మజరా బొడ్డేచర్ల గ్రామం, గోపవరం మండలం
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి
సోమశిలలో సాగు భూమి, రెండు నివాస కొట్టాలు ముంపునకు గురయ్యాయి. జీవో ఎంఎస్ నెం.98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2004 తరువాత దరఖాస్తు చేశాను. నేను పదో తరగతి వరకు చదివాను. కానీ ఉద్యోగం రాలేదు. నా కొడుకు వరవల్లి శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేశాడు. వాడికే ఉద్యోగం ఇవ్వాలని 2013లో దరఖాస్తు చేశాను. సీనియారిటీ జాబితాలో 3630 నెంబరులో ఉంది. దళారులు రంగప్రవేశం చేసి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలి.
- వరపల్లి వెంకటరమణ, గట్టుపల్లి గ్రామం, గోపవరం
Updated Date - 2020-02-24T11:42:22+05:30 IST