గండికోట నిర్వాసితుల గుండెకోత.. చుట్టుముట్టిన బ్యాక్‌వాటర్
ABN, First Publish Date - 2020-09-14T17:44:56+05:30
గండికోట ప్రాజెక్టులో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు..
వర్షంతో ఇళ్లలోకి చేరిన నీళ్లు
దిక్కుతోచని స్థితిలో నిర్వాసితులు
కొండాపురం(కడప): గండికోట ప్రాజెక్టులో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనూహ్యంగా బ్యాక్‌వాటర్ పెరుగుతుండడంతో నిర్వాసితుల ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిర్వాసితులు భయంభయంగా గడుపుతున్నారు. గండికోట ప్రాజెక్టులో 12.5 టీఎంసీల వద్ద ఉన్న నీటిమట్టం అనూహ్యంగా అర టీఎంసీకి పైగా పెరగడంతో తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని బీసీ కాలనీని బ్యాక్‌వాటర్ చుట్టుముట్టి కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో నిర్వాసితులు భయంభయంగా గడుపుతున్నారు. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడం, కొందరి ఇళ్లలోకి నీళ్లు రావడంతో విషపురుగులతో సహజీవనం చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాములు, తేళ్లు వచ్చి చేరుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పునరావాసం కల్పించే వరకు బ్యాక్‌వాటర్‌ను తగ్గించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే నిర్మితమైన నేదరపేట పునరావాస కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్థంగా ఉండడంతో వర్షపునీరంతా కాలనీని చుట్టుముట్టిందని, తమను పట్టించుకునే వారు లేరని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. గండికోటలో బ్యాక్‌వాటర్ పెరగకుండా వచ్చే నీటిని గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి పంపిస్తున్నామని జీఎన్‌ఎస్ఎస్ ఈఈ రామాంజనేయులు తెలిపారు.
11వరోజు కొనసాగిన ఆందోళన
గండికోట ముంపు గ్రామమైన తాళ్లప్రొద్దుటూరులో 10 రోజులుగా చేస్తున్న ఆందోళన ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. రోడ్డుపై గాని, వీధుల్లో గాని పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తాళ్లప్రొద్దుటూరులోని సిద్దార్థ హైస్కూల్లో భౌతికదూరం పాటిస్తూ నిర్వాసితులు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగా సీపీఐ, సీపీఎం నాయకులు బ్యాక్‌వాటర్‌లో దిగి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన రాయలసీమ ఇన్‌చార్జి సుంకర శ్రీనివాస్, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ నేత చాంద్‌బాష, విజయ్, దివాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-14T17:44:56+05:30 IST