దాచాలంటే దాగదులే!
ABN, First Publish Date - 2020-04-12T08:28:12+05:30
అతిగా భయపడొద్దు! అలాగని అలసత్వమూ ప్రదర్శించవద్దు! ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు! అందుకే... లాక్‌డౌన్ పొడిగించాలని అనేక రాష్ట్రాలు...
- కరోనాతో దాగుడు మూతలు
- ప్రధాని ముందూ తప్పుడు వివరాలు
- వీడియో కాన్ఫరెన్స్‌లో వింత లెక్కలు
- 20 కేసులు దాటిన జిల్లాలు ఏడు
- కానీ... మ్యాప్‌లో కేవలం రెండు జిల్లాలే
- తీవ్రత తగ్గించి చూపేందుకు తాపత్రయం
- అన్ని రాష్ట్రాల్లో జిల్లా యూనిట్‌గా లెక్కింపు
- ఏపీలో మాత్రం కొత్తగా మండలాల లెక్క
- సీఎం తీరుపై అధికారుల్లోనే ఆందోళన
(అమరావతి - ఆంధ్రజ్యోతి) : అతిగా భయపడొద్దు! అలాగని అలసత్వమూ ప్రదర్శించవద్దు! ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు! అందుకే... లాక్‌డౌన్ పొడిగించాలని అనేక రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీకి ఆయా రాష్ట్రాల సీఎంలు ఇదే సూచన చేశారు. కానీ... ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల కష్టాల నేపథ్యంలో రెడ్ జోన్లలో మాత్రమే లాక్‌డౌన్ కొనసాగించాలని సీఎం జగన్ కోరారు. ఈ వాదనలోనూ హేతుబద్ధత ఉండొచ్చు. అయితే, కరోనా తీవ్రతను తగ్గించి చూపించేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం, పడిన తాపత్రయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఎం ఇచ్చిన ప్రజంటేషన్ ప్రకారం... మార్చి 20వ తేదీ నాటికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే, అదీ పదికిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి.
మరో 20 రోజుల్లో అంటే, శుక్రవారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాలకు వైరస్ పాకింది. అందులోనూ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 20కిపైగా కేసులు నమోదయ్యాయని ఈ ప్రజంటేషన్‌లో వివరించారు. ఈ రెండు జిల్లాలను మాత్రమే ‘ఎరుపు’ రంగులో చూపించారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే శుక్రవారమే ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 20కి మించి నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికే ఆ సంఖ్య ఏడుకు చేరింది. చిత్తూరు, విశాఖల్లో సరిగ్గా 20 కేసులు ఉండటంతో ‘రెడ్ జోన్’లో పడలేదు. మరొక్క కేసు అదనంగా నమోదైనా అవీ రెడ్‌లో పడేవి. అనంతపురం జిల్లాలో కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ... ఒక మరణం చోటు చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాకుండా పూర్తి భద్రంగా ఉన్నాయి. అసలు వాస్తవం ఇదికాగా... ప్రధానికి ఇచ్చిన ప్రజంటేషన్‌లో కేవలం రెండు జిల్లాలను మాత్రమే ఎరుపులో చూపించడం గమనార్హం. ప్రధానికి కరోనా పాజిటివ్ కేసుల లెక్కను వీలైనంత తక్కువ చేసి చూపించాలనే తాపత్రయం అడుగడుగునా కనిపించింది. శనివారం మధ్యాహ్నం వరకు మీడియా బులెటిన్ ఇవ్వకుండా పాత అంకెలతోనే నడిపించారు. ఆ తర్వాత బులెటిన్ విడుదల చేశారు. దీనిప్రకారం చూసినా 7 జిల్లాల్లో 20కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నంలో సరిగ్గా 20 కేసులు లెక్క తేలాయి. మొత్తం కేసుల సంఖ్య 400 మార్కును దాటింది.
మండలాల లెక్క దేనికి?
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ముఖ్యమంత్రి జగన్ కొత్తగా మండలాల లెక్క బయటికి తీశారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయన్నారు. 44 ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని... 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు. నిజానికి, కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ జిల్లాల వారీగానే లెక్కలు విడుదల చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిని ‘రెడ్‌జోన్’గా పరిగణిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 133 రెడ్‌జోన్లు ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటిదాకా మండలాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ లెక్కలు చెప్పనే లేదు. ‘‘కేవలం 37 మండలాలనే రెడ్ జోన్లుగా గుర్తించి, లాక్‌డౌన్ వాటికి మాత్రమే పరిమితం చేయడం ఆచరణలో సాధ్యం కాదు. మిగిలిన మండలాల్లో ఏం చేద్దామని ప్రభుత్వం భావిస్తోంది? స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకే ఈ మండలాల లెక్క తీశారా? అదే నిజమైతే ప్రమాదంతో చెలగాటమాడటమే! కరోనా వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ 405 కేసులతో దేశంలో 8వ స్థానంలో ఉంది. 13 జిల్లాలున్న రాష్ట్రంలో 8 జిల్లాల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో ముప్పును ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకానీ, ముప్పును తక్కువచేస్తే మొదటికే నష్టం వస్తుంది’’ అని సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
Updated Date - 2020-04-12T08:28:12+05:30 IST