అమ్మభాషలోనే చెప్పాలి
ABN, First Publish Date - 2020-09-04T08:53:44+05:30
తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి... 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదువు చెప్పాలన్న సర్కారు ఆకాంక్షలకు
చట్టం ప్రకారం ఇదే కదా జరగాలి?
ఏపీ సర్కారును ప్రశ్నించిన సుప్రీం
‘ఆంగ్లం’పై సర్కారుకు మళ్లీ దెబ్బ
హైకోర్టు ఆదేశాలపై స్టేకు నో
కౌంటర్లు దాఖలు చేయడానికి
ప్రతివాదులకు టైం ఇవ్వాలని నిర్ణయం
విచారణ ఈనెల 25కు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం అమలుపై ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దుచేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సర్కారుకు అక్కడా చుక్కెదురయింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ‘చట్టం ప్రకారం మాతృభాషలోనే కదా బోధన జరగాల్సింది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి... 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదువు చెప్పాలన్న సర్కారు ఆకాంక్షలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఇంగ్లీషు మీడియంపై జారీ చేసిన జీవోలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వాటిని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టి్‌సడీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ కేఎం జోసె్‌ఫతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు ప్రారంభిస్తూ... హైకోర్టు పరిశీలనలు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. మాధ్యమాన్ని ఎంచుకునే హక్కు తల్లిదండ్రులు, వారి పిల్లలకు ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య బోధించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రగతిశీల చర్యగా ఆయన అభివర్ణించారు.
95శాతం మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంనే కోరుకుంటున్నారని చెప్పారు. అలాగని తెలుగు మాధ్యమాన్ని నిర్లక్ష్యం చేయడం లేదని, ఆ మీడియంలో బోధన కోసం పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, అవి ఉన్న చోటుకు విద్యార్థులు చేరుకొనేందుకుగాను ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు.ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనేది ముందుచూపుతో తీసుకొన్న నిర్ణయమని, జనరంజక కోణంలో చేసింది కాదన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొంది. ‘‘విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం ఆచరణలో సాధ్యమైనంతవరకు మాతృభాషలోనే బోధన జరగాలి కదా? దీన్నే హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లుంది’’ అని వ్యాఖ్యానించింది.
ఆపై విశ్వనాథన్ తన వాదనలను కొనసాగిస్తూ...విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం బోధనను కోరుకుంటున్నారని, తెలుగు బోధన కావాలనుకునే వారికి తెలుగు మీడియం పాఠశాలలను అందుబాటులో ఉంచుతామన్నారు. కాబట్టి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29 (ఎఫ్)ను పాటించినట్లేనని చెప్పారు. నిర్దిష్టంగా ఇదే మాధ్యమంలో బోధన చేపట్టాలని విద్యా హక్కు చట్టం చెప్పలేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ప్రభుత్వ పాఠశాలల కోసమేనన్నారు.
ఇంగ్లీష్ చదవబట్టే ఇలా వాదనలు..
‘‘40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి కోయంబత్తూరు వచ్చి నేను చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ మీడియంలో చదవకుంటే బహుశా మీరు నా వాదనలు వినేవాళ్లు కాదేమో’’ అని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియం జీవోలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే ఉన్నాయని, బలమైన ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలదన్నారు. చట్టానికి లోబడి మాతృభాషను పరిరక్షిస్తూనే, ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీష్ మీడియం బోధనను అందిస్తుందన్నారు.
ప్రైవేటు పాఠశాలలే ఉత్తమమని భావించి, ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు వెళ్లిపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్షరాస్యతలో అభివృద్ధి సాధించడమంటే (ఇర్రీప్రేసెబుల్ లిటరసీ) మాతృభాషలోనే బోధనా మాధ్యమం ఉండాలని అర్థం కాదన్నారు. ఈ సమయంలో మరోసారి ధర్మాసనం జోక్యం చేసుకొంది.
‘‘అక్షరాస్యతలో అభివృద్ధి అంటే భాషలో ప్రావీణ్యత కావచ్చు. అందుకు బోధనా మాధ్యమం తప్పనిసరి కాదు’’ అని వ్యాఖ్యానించింది. విశ్వనాథన్ తన వాదనలు కొనసాగిస్తూ.. తెలుగును పణంగా పెట్టడం లేదని, ఆ భాషను ఇంట్లో మాట్లాడుకోవచ్చునన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో ముందుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లీష్ ఆవశ్యకతపై రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వ్యాఖ్యలను ఉటంకించారు.
మీడియంపై హక్కును చంపేశారు..
కేవియెట్ దాఖలు చేసిన ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ... విద్యార్థులు, తల్లిదండ్రులు ఏ మీడియంలో తమకు బోధన కావాలనేది ఎంచుకునే హక్కును ప్రభుత్వం కాలరాసిందని స్పష్టం చేశారు. ఏపీలో తెలుగు మీడియం పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియంగా మార్చారని తెలిపారు. ప్రభుత్వం మాతృభాషను ప్రోత్సహించాలన్నారు.
ఇరుపక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం.. ప్రస్తుతం స్టే ఇవ్వబోమని, తమ జవాబులను దాఖలు చేయడానికి ప్రతివాదులకు సమయం ఇస్తామని స్పష్టం చేసింది. విశ్వనాథన్ దీనిపై స్పందిస్తూ.. అంతిమంగా ముందుకెళ్లవద్దని ధర్మాసనం ఆదేశిస్తే, ప్రభుత్వం సులభంగా వెనక్కి వెళుతుందని, కానీ నిర్ణయాన్ని మార్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఈ అంశంపై గోపాల్ శంకరనారాయణన్, విశ్వనాథన్ మధ్య స్పల్ప వాగ్వివాదం జరిగింది. ఏ రకంగా నిర్ణయాన్ని మార్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, దీని అర్థం ఏమిటని గోపాల్ ప్రశ్నించారు. ‘ఒక తరం అవకాశాన్ని కోల్పోతుంది. మీ లాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడ’లేరని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. కాగా, సమాధానాలు ఇవ్వాలని ఇతర ప్రతివాదులుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
Updated Date - 2020-09-04T08:53:44+05:30 IST