ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలగపూడిలో హైటెన్షన్‌

ABN, First Publish Date - 2020-12-29T07:28:25+05:30

దళితుల్లోని రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో రాజధాని గ్రామమైన వెలగపూడిలో వేడి రాజుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎస్సీల్లోని వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్లదాడిలో మహిళ మృతి
  • ఎంపీ నందిగం సురేశ్‌ రెచ్చగొట్టారని ఆరోపణ
  • కేసులో ఏ1గా చేర్చాలని బాధితుల డిమాండ్‌
  • ఎంపీపై చెప్పుతో దాడికి యత్నం
  • మృతదేహంతో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు!.. సర్దిచెప్పిన హోంమంత్రి


గుంటూరు/తుళ్లూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దళితుల్లోని రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో రాజధాని గ్రామమైన వెలగపూడిలో వేడి రాజుకుంది. రాళ్లదాడిలో ఒక మహిళ మృతి చెందడంతో వివాదం మరింత పెరిగింది. న్యాయం కావాలంటూ బాధితులు మృతదేహంతో సీఎం క్యాంపు ఆఫీస్‌కుర్యాలీగా బయలుదేరారు. పరామర్శకు వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై తిట్ల వర్షం కురిపించి... దాడి చేయబోయారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి దాకా జరిగిన వరుస ఘటనలతో రాజధాని గ్రామం అట్టుడికి పోయింది. వైఎస్‌ హయాంలో వెలగపూడి ఎస్సీ కాలనీలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి ఎదురుగా ఎస్సీల్లోనే మరోవర్గం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది.


జగ్జీవన్‌రామ్‌ విగ్రహం పక్కన ఉన్న పంచాయతీ రోడ్డును సిమెంట్‌ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అక్కడ ఆర్చిని నిర్మించి, జగ్జీవన్‌రామ్‌ కాలనీ అని పేరు పెట్టాలని ఒకవర్గం భావించింది. ఈ బజారులో ఎక్కువగా ఉన్న ఎస్సీల్లోని వేరేవర్గం.. ఆర్చి ఏర్పాటును వ్యతిరేకించాయి. ఇదే అంశంపై ఆదివారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన రాళ్లదాడిలో మరియమ్మ (55) అనే మహిళ మృతి చెందారు. ఈ ఘర్షణలకు ఎంపీ సురేశ్‌ కారణమని మరో వర్గం వారు ఆరోపించారు. ఆర్చిని వ్యతిరేకించే వారిని రెచ్చగొట్టారని... తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.


టెన్షన్‌.. టెన్షన్‌..

మరియమ్మ మృతి ఘటనతో ఆమె వర్గానికి చెందిన వారు పెద్దసంఖ్యలో వెలగపూడి చేరుకున్నారు. దాడి జరిగి 24 గంటలవుతున్నా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా అంటూ దళిత నేతలు జడ శ్రావణ్‌ కుమార్‌, మేళం భాగ్యారావు నేతృత్వంలో దళిత సంఘాలు, బాధితులు ఆగ్రహించారు. సోమవారం రాత్రి మరియమ్మ మృతదేహాన్ని కాలనీ వాసులు, దళిత నేతలు తీసుకొని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వైపు కదిలారు. అక్కడే తేల్చుకొంటామని ఆవేశంగా బయలుదేరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని వెలగపూడి సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాలనీ వాసులు రోడ్డుపైనే బైఠాయించారు. దాడికి కారకులని 29 మంది పేర్లతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సురేశ్‌ను ఏ1గా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చాలాసేపటివరకు బైఠాయించారు. వారికి సర్ది చెప్పేందుకు హోం మంత్రి సుచరిత చేరుకొన్నారు. ఇదే సమయంలో ఎంపీ సురేశ్‌ కూడా  వచ్చారు. ఆయన్ను చూడగానే మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు.  తిట్ల వర్షం కురిపించారు. వారిలో ఒకరు చెప్పు తీసుకొని సురేశ్‌ను కొట్టేందుకు ప్రయత్నించారు.


మరోవైపు... నెల్లూరు జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్న వెంకటరమణే గొడవకు కారణమని కాలనీకి చెందిన ఎస్సీల్లోని మరోవర్గం రోడ్డుపై బైఠాయించింది. సురేశ్‌ అనుకూల నినాదాలు చేసింది. దీంతో.. వెలగపూడిలో రోజంతా ఉద్రిక్త త నెలకొంది. వైసీపీకి ఓట్లు వేసి కావాలని గెలిపించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నామని హోంమంత్రి ఎదుట బాధితులు వాపోయారు. సీఐ ధర్మేంద్రబాబు ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులను శిక్షిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. ‘‘పది లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తాం. శాంతి కమిటీ ఏర్పాటు చేసి ప్రశాంత వాతవరణం కల్పిస్తాం.  పరిస్థితి అదుపులోకి వచ్చే దాకా 144 సెక్షన్‌ అమలుచేస్తాం. పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఎస్సీలంతా ఐక్యతతో ఉండాలన్నారు. అనంతరం ఆందోళన విరమించి, మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం బాధితులు అప్పగించారు.

Updated Date - 2020-12-29T07:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising