ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్
ABN, First Publish Date - 2020-11-03T18:16:26+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి సహాయ నిరాకరణపై ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి మరోసారి అక్షింతలు వేసింది. ఎన్నికల కమిషనర్‌కు సహకరించట్లేదని గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, నిమ్మగడ్డ తరఫు వాదనలను న్యాయస్థాయం ఆలకించింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని హైకోర్టు పేర్కొంది.
తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని...ప్రభుత్వం కావాలనే ఎస్ఈసీకి సహాయ సహకారాలందించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని న్యాయస్థానం పేర్కొంది.
ప్రభుత్వం సహాయమందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అమలు చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ అడ్వకేట్లు సీతారామ్మూర్తి, అశ్వనీకుమార్‌లు వాదనలు వినిపించారు.
Updated Date - 2020-11-03T18:16:26+05:30 IST