కనువిప్పు కలిగేనా?
ABN, First Publish Date - 2020-03-16T07:05:43+05:30
చరిత్రలో ఎన్నడూ లేన్నట్లుగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆటవిక రాజ్యాన్ని తలపించింది.
ఆటవిక రాజ్యాన్ని తలపించిన ఘటనలు
పల్నాడులో అపహాస్యం పాలైన ఎన్నికల ప్రక్రియ
నడిరోడ్డుపై బరిసెలు, రాళ్లతో టీడీపీ నేతలపై హత్యాయత్నం
పోలీసుల ప్రోద్బలంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
పలుచోట్ల పోలీసులే అక్రమ కేసుల పేరుతో బెదిరింపు
నామినేషన్ల పత్రాలు చించివేత... బెదిరింపులతో ఉపసంహరణలు
ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనైనా మార్పు వచ్చేనా?
గుంటూరు, మార్చి 15: చరిత్రలో ఎన్నడూ లేన్నట్లుగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆటవిక రాజ్యాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం దిగజారుతున్న పోలీస్‌శాఖ ప్రతిష్టను మరింత మసకబారేలా చేసింది. నడిరోడ్డుపై వైసీపీ శ్రేణులు బరిసెలు, రాళ్లతో టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, న్యాయవాదిపై మాచర్లలో చేసినదాడి తీవ్ర కలకలం రేపింది. దానిపై పోలీసులు తొలుత బెయిలబుల్ కేసులు నమోదుచేసి ప్రధాన నిందితుడు నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాక మాచర్లలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులను నామినేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు, నామినేషన్లను బలవంతంగా గుంజుకొని చించివేశారు. మరికొందరిని కిడ్నాప్ చేసి బెదిరించారు. పలువురి నామినేషన్లను ఉపసంహరింపచేశారు.
ఒక్క మాచర్లలోనే కాకుండా పల్నాడులోని నరసరావుపేట, గురజాల, డెల్టాలోని రేపల్లె నియోజకవర్గాల్లో ఏకంగా పోలీసులే అధికార పార్టీ నాయకులకు అనుకూలం పనిచేశారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికిస్తామంటూ పోలీసులే బెదిరించారు. మరికొన్ని చోట్ల పోలీసులు నేరుగా పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్థులకు ఫోన్‌లు చేసి బరినుంచి తప్పుకోవాలని, లేదంటే కేసులో ఇరికిస్తామని బెదిరించారు. మరికొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. నగరం మండలం ఎద్దుపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఆళ్ల పూర్ణ, ఆయన సోదరుడు ఆళ్ల చౌదరిల గడ్డి వామిలో మద్యం బాటిళ్లు ఉంచి అక్రమ మద్యం దాచినట్లు కేసుపెట్టి రిమాండ్‌కు పంపారు. దీంతో వారు నామినేషన్ వేయలేకపోయారు. నగరం మండల పరిధిలోని ధూళిపూడి ఎంపీటీసీ అభ్యర్థిని ఆరుంబాక మల్లేశ్వరిపై స్థానిక ఎస్సై వాసు తప్పుడు కేసు బనాయించే ప్రయత్నం చేశారు.
ఆమెపై గతంలో ఎటువంటి కేసులు లేనప్పటికీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని పోలీసులను పంపారు. ఆమెను స్టేషన్‌కు తీసుకువెళుతున్న సమయంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వచ్చి నిలదీయడంతో పోలీసులు జారుకున్నారు. నగరం ఎస్‌ఐ వారు పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ టీడీపీ వారిని బెదిరిస్తున్నారని ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రూరల్ సీఐ జి.శ్రీనివాసరావు కూడా టీడీపీ నేతలను, కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఇంతకు ముందు ఓ హత్య కేసులో టీడీపీ నాయకుడిని ఇరికించేందుకు యత్నించడమేకాక ఆయనను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైనప్పటికీ రోజుల వ్యవధిలోనే సస్పెన్షన్ ఎత్తివేసి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది.
ఇదిలావుంటే పల్నాడులోని పిన్నెల్లిలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్లగా అడ్డుకున్నారు. వెల్దుర్తి మండలం బోదెలవీడులో టీడీపీ మహిళా అభ్యర్థిని నుంచి నామినేషన్ పత్రాలను గుంజుకెళ్లారు. నరసరావుపేట పరిధిలోని ములకలూరు, పమిడిపాడు ఎంపీటీసీ సభ్యులను నామినేషన్ వేయనివ్వకుండా వైసీపీ వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో అక్కడకు చేరుకున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవిందబాబుపై వైసీపీవర్గాలు దాడికి యత్నించాయి. టీడీపీ అభ్యర్థి పులిమిరామిరెడ్డిపై కూడా వైసీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఇక్కుర్రు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గుంజి హైమావతి వద్ద నామినేషన్ పత్రాలు తీసుకొని చించివేశారు. సత్తెనపల్లి పరిధిలోని కంకణాలపల్లిలో జనసేన అభ్యర్థి వెల్పేరి శ్రీనివాసరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి కిడ్నాప్ చేశారు.
చిలకలూరిపేటలో టీడీపీ నాయకుడు గట్టినేని సాయి, నాదెండ్ల జడ్పీటీసీ అభ్యర్థి బండారు సత్యనారాయణ, యడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి పావులూరి శ్రీనివాసరావులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరించారు. స్థానిక ఎమ్మెల్యే భర్త ఆదేశాలతోనే చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐ షఫి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వారు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనండంతో మద్యం సీసాలు తెచ్చి వారి కారులో పెట్టి తప్పుడు కేసు బనాయించారన్నారు. రొంపిచర్ల, దుర్గి, మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నాదెండ్ల, మాచవరం తదితర మండలాల్లో పెద్ద ఎత్తున పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే అరోపణలు వచ్చాయి. తెనాలిలో ఏకంగా టీడీపీ అభ్యర్థి ఇంటిలో అర్ధరాత్రి మద్యం బాటిళ్లు పెట్టేందుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం వైసీపీ దారుణాలకు అద్దం పట్టింది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఇటువంటి తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురిచేశాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందనలేదు.
రూరల్ జిల్లా పరిధిలో దారుణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రూరల్ ఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ప్రతిపక్ష టీడీపీతో పాటు మిగిలిన పార్టీలు కూడా రూరల్ ఎస్పీ విజయరావు పనితీరుపై పెద్దఎత్తున విమర్శలు, ఫిర్యాదులు చేశాయి. ఫలితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కన్నెర చేసింది. దీంతో రూరల్ ఎస్పీ విజయరావును బదిలీచేయాలని, మాచర్ల సీఐ రాజేశ్వరరావును సస్పెండ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు పోలీస్‌శాఖలో కలకలం రేపాయి. కొద్ది రోజులుగా వ్యవహరిస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
ఇకనైనా పోలీసుల తీరు మారేనా...
జిల్లాలో ముఖ్యంగా రూరల్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీస్‌యంత్రాంగం వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా మారింది. అటువంటి వారిని కట్టడి చేయాల్సిన ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారు. ఫలితంగా ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇప్పటికైనా పోలీసుల తీరు మార్చుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. అడ్డగోలుగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, సిబ్బందిపై తక్షణం సస్పెన్షన్ వేటు విధించాలని కూడా పలువురు కోరుతున్నారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించేది. అక్కడక్కడ ఒకరిద్దరు అధికార పార్టీకి వత్తాసు పలికినా అది కూడా పరోక్షంగా ఉండేది.
ఈ స్థాయిలో బహిరంగంగా పోలీసులే బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఎన్నడూ జరగలేదు. కనీసం పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. ఫ్యాక్షన్, మావోయిస్టు ప్రభావిత పల్నాడులో స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా గతంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను రంగంలోకి దించేవారు. ఈసారి ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఉన్న పోలీస్ అధికారుల్లో ఎక్కువ మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగా అధికారపార్టీకి దాసోహం అయ్యారు. ఈ పరిణామాలు పోలీస్‌శాఖపై ప్రజల్లో మరింత అపనమ్మకానికి గురిచేస్తున్నాయి. ఇకనైనా పోలీస్ అధికారులు అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే ఆయా ఎన్నికలు సజావుగా ముగిసే అవకాశం ఉంటుంది.
Updated Date - 2020-03-16T07:05:43+05:30 IST