ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం
ABN, First Publish Date - 2020-12-30T05:13:25+05:30
రాజధాని మూడు ముక్కలతో అభివృద్ధి జరగదని, ప్రత్యేకహోదా తోనే అది సాధ్యమని అమరావతి రైతులు, మహిళలు తెలిపారు.
అది సాధించలేక పాలకుల మూడు ముక్కలాట
378వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, డిసెంబరు 29: రాజధాని మూడు ముక్కలతో అభివృద్ధి జరగదని, ప్రత్యేకహోదా తోనే అది సాధ్యమని అమరావతి రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారంతో 378వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, పెదపరిమి గ్రామాల్లో రైతు దీక్షా శిబిరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం వద్ద మోకరిల్లి ఆ అంశాన్ని గాలికి వదిలేశారన్నారు. అమరావతిని నాశనం చేయడానికే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. అమరావతికి 33 వేల ఎకరాలు ఇస్తే అభివృద్ధి చేయటం చేతకాక పాలకులు మూడు ముక్కల ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించలేక అమరావతిని నాశనం చేయాలనే ఒకే ఒక్క అజెండాతో పరిపాలన సాగిస్తున్నారన్నారు.
- తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల దీక్షలు 378వ రోజుకు చేరాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు మంగళవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధానిని తరలించేందుకు గల స్పష్టమైన కారణాలను ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-30T05:13:25+05:30 IST