రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-12-05T05:33:50+05:30
చౌడవరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందుపురానికి చెందిన రియాజ్(62) మృతి చెందాడు.
ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్తుండగా ఘటన
ఏడుగురుకి గాయాలు
బాధితులను పరామర్శించిన హిందూపురం ఎంపీ
గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 4: చౌడవరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందుపురానికి చెందిన రియాజ్(62) మృతి చెందాడు. సేకరించిన వివరాల మేరకు.. పట్టు రీలర్ల అసోసియేషన్ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పదిరోజులుగా ధర్మవరంలో ధర్నా చేస్తున్నారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకొనేందుకు అనంతపురం జిల్లా పట్టు రీలర్ల అసోసియేషన్ సభ్యులు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చౌడవరం వద్దకు రాగానే మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందగా హిందుపురానికి చెందిన ముస్తఫా, ధర్మవరానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఆదం ఆలీ, తిరుపాల్, కదిరికి చెందిన హైదర్ ఆలీ, ఇంతియాజ్, డ్రైవర్ ముక్తియార్‌లు గాయపడ్డారు. పోలీసు పెట్రోలింగ్ వాహనంలో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. నల్లపాడు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-05T05:33:50+05:30 IST