బయటకు రావాలంటే సిగ్గేస్తోంది..!: వైసీపీ కార్యకర్త
ABN, First Publish Date - 2020-03-16T07:11:12+05:30
జగన్ అధికారంలోకి రావాలని..
సీఎం మనసు మారకపోతే ఉగాది నుంచి ఆమరణ నిరాహార దీక్ష
వైసీపీ కార్యకర్త మామిళ్లపల్లి నరేంద్రబాబు
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జగన్ అధికారంలోకి రావాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశా... చంద్రబాబు అమరావతిలో చేసిన అభివృద్ధి చూసి.. యువకుడైన జగన్ మరింత చేస్తారన్న ఆశతో ఓట్లు వేయించా.. మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఇంటి నుంచి బయటకు రావాలంటే సిగ్గేస్తోందని రాయపూడికి చెందిన రైతు, వైసీపీ కార్యకర్త మామిళ్లపల్లి నరేంద్రబాబు అన్నారు. జీవితంలో ఏ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం పిలుపు మేరకు భవిష్యత్తు బాగుంటుందని 30ఏళ్ల నాటి నిమ్మతోట కూడా ఇచ్చాను. గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీకి మారానన్నారు. 2014లో రాయపూడిలో టీడీపీకి వెయ్యి ఓట్లు మెజార్టీ వస్తే 19లో వైసీపీకి 180 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చా... ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశాను. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు.
సీఎం మనసు మారాలని అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ 100 రోజుల దీక్ష తలపెట్టాను... 60 గంటల తర్వాత మాజీ మంత్రి దేవినేని, కుటుంబ సభ్యులు బలవంతంగా దీక్ష విరమించారు. కనీసం ఉమ్ముకూడా మిగకుండా చేశాను. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదటపడుతోంది. సీఎం జగన్ నిర్ణయం మార్చుకోకపోతే ఉగాది నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటాను. ఇప్పటికి నేను వైసీపీలోనే ఉన్నాను... జగన్ కోసం పనిచేస్తాను... అయితే అమరావతిని అభివృద్ధి చేయమని డిమాండ్ చేస్తున్నా... అది జరగకపోతే నాలాంటి చాలా మంది ఈ గ్రామాల్లో బయటకు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని నరేంద్రబాబు చెప్పారు.
Updated Date - 2020-03-16T07:11:12+05:30 IST