సర్కారుది మొద్దునిద్ర
ABN, First Publish Date - 2020-12-29T07:41:21+05:30
మొద్దు నిద్ర పోతున్న వైసీపీ ప్రభుత్వాన్ని కదిలించేందుకు ప్రతి రైతు ఓ ముల్లుగర్రగా మారాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపునిచ్చారు.
- ఒక్కో రైతు ఒక్కో ముల్లుగర్ర కావాలి
- రైతు సాంత్వన యాత్రల్లో నారా లోకేశ్ ధ్వజం
- ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలకు పరామర్శ
- ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్
అమరావతి(ఆంధ్రజ్యోతి), అవనిగడ్డ టౌన్, డిసెంబరు 28: మొద్దు నిద్ర పోతున్న వైసీపీ ప్రభుత్వాన్ని కదిలించేందుకు ప్రతి రైతు ఓ ముల్లుగర్రగా మారాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపునిచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకూ పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. నివర్ తుఫానుతో పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సోమవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన రైతు సాంత్వన యాత్ర నిర్వహించారు. ఈ పర్యటనలో లోకేశ్‌ను రైతులు అడుగడుగునా ఆపి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పాగోలులో ఆత్మహత్య చేసుకున్న గద్వాల్ కృష్ణ పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని అనంతరం ట్విటర్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు. అవనిగడ్డలో దారి పొడవునా లోకేశ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మోదుమూడిలో రచ్చబండలో, రైతులతో ముఖాముఖిలో, మీడియాతోనూ లోకేశ్ మాట్లాడారు. కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, అందుకే కోత కోయకుండానే పొలాన్ని దమ్ము చేసి మినుము చల్లుకున్నామని మాజేరులో కౌలు రైతు నాగేశ్వరరావు లోకేశ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వం కౌలు రైతుల గురించి ఆలోచించటం లేదని వాపోయారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. కొనుగోలు చేయడం లేదని, దీంతో దళారులు బస్తా రూ.900కు అడుగుతున్నారని పాత మాజేరు వద్ద రోడ్డుపక్కన ధాన్యం ఆరబోసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వంపై లోకేశ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం దున్నపోతు మాదిరి తయారయ్యిందన్నారు. కాగా.. వ్యవసాయంలో కష్టనష్టాలతో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ చేపట్టిన రైతు సాంత్వన యాత్రలు తొలి రోజు సోమవారం 119 నియోజకవర్గాల్లో విజయవంతంగా జరిగాయి.
Updated Date - 2020-12-29T07:41:21+05:30 IST