కొత్త రాజధానిలో అన్ని ఏర్పాట్లూ చేస్తాం: సజ్జల
ABN, First Publish Date - 2020-12-15T09:33:48+05:30
కొత్త రాజధానికి సచివాలయ ఉద్యోగులు తరలి వెళ్లే సమయానికి అక్కడ వారికి క్రీడల నిర్వహణకు అన్ని వసతులూ కల్పిస్తామని
త్వరగా తీసుకెళ్లండి: ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కొత్త రాజధానికి సచివాలయ ఉద్యోగులు తరలి వెళ్లే సమయానికి అక్కడ వారికి క్రీడల నిర్వహణకు అన్ని వసతులూ కల్పిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. క్రీడలు నిర్వహించుకునేందుకు స్పోర్స్ట్‌క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి సచివాలయంలో సోమవారం సచివాలయ ఉద్యోగుల వార్షిక స్పోర్ట్స్‌మీట్-2020 కార్యక్రమాన్ని సజ్జల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయ ఉద్యోగులకు ఏడాదికోసారి కాకుండా నిరంతరంగా క్రీడలు నిర్వహస్తే బాగుంటుందన్నారు. పెద్ద స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు అవకాశం ఉన్నంత వరకు కృషి చేస్తానన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో స్పోర్ట్ మీట్ కోసం స్టేజీ వేయాలని ఇక్కడి(అమరావతిలో) టెంట్ హౌస్ వారిని తాము కోరితే, ఎవరూ రామన్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు తమపై బాగా ధ్వేషం పెంచుకుంటున్నారని తాము అనుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగులను ఇక్కడి నుంచి కొత్త రాజధానికి తీసుకువెళ్లాలని కోరారు.
సీఎం సలహాదారు అజేయ కల్లం మాట్లాడుతూ ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు క్రీడలు ఆనందం, ఆహ్లాదం కలిగిస్తాయన్నారు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ జ్యోతి సురేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఉద్యోగులకు బహుమతులు ఇచ్చి సత్కరించారు.
Updated Date - 2020-12-15T09:33:48+05:30 IST