బతుకులు ‘గోదాట్లో’!
ABN, First Publish Date - 2020-08-22T08:52:00+05:30
గోదావరి వరద.. తూర్పు గోదావరి జిల్లాలో వేలాదిమంది ఏజెన్సీ, కోనసీమవాసుల బతుకులను గోదాట్లో ముంచేసింది.
గోదావరి వరదలతో వందలాది ‘తూర్పు’ లంకలు విలవిల
వారం రోజులుగా నీటిలోనే బాధితులు
గూడు, గొడ్డు.. కుటుంబానికి 5 లక్షల నష్టం
వలంటీర్లే దిక్కు, స్పందించని అధికారులు
ఇక్కడో ఊరు ఉండేది.. దూరంగా ఏరు పారేది.. అనే గీతలు చెదిరి.. గోదారి ప్రజలకు వెతలే మిగిలాయి. వరదకు తెగిన వంతెనల కిందా పైనా వారి కన్నీరే పారుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో నెత్తిన బరువు, గుండెల్నిండా భయంతో బితుకుబితుకుమంటూ బడుగుజీవుల అడుగులు..
కాకినాడ, ఆంధ్రజ్యోతి: గోదావరి వరద.. తూర్పు గోదావరి జిల్లాలో వేలాదిమంది ఏజెన్సీ, కోనసీమవాసుల బతుకులను గోదాట్లో ముంచేసింది. సర్వం కోల్పోయి రోడ్డునపడేలా చేసింది. జిల్లాలోని 26 మండలాల్లో 168 గ్రామాలను వరద చుట్టుముట్టడంతో లక్ష మంది వరకు బాధితులుగా మిగిలారు. కోనసీమలో వందలాది లంక గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఏ ఊరు ఎక్కడుం దో కూడా గుర్తుపట్టడం కష్టంగా మారింది. ముందస్తు వరద సహాయక చర్యల్లో అధికారులు విఫలం కావడంతో వరద బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. కాగా, గోదావరి వరదతో ఏజెన్సీలోని దేవీపట్నం, చింతూరు, కూనవరం తదితర మండలాల్లో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలు తీవ్రం తా దెబ్బతిన్నాయి. వందలాది కుటుంబాలు కొండలపైకి ఎక్కి తలదాచుకుంటున్నాయి. వీరి ఇళ్లన్నీ వరద ముంపులో కొట్టుకుపోయాయి. ఇంట్లో సామాన్లు, వస్త్రాలు, పాత్రలన్నీ చెల్లాచెదురైపోయాయి. ముంపు భారీగా ఉన్న దేవీపట్నం మండలం కచ్చులూరులో బాధితులు కట్టుబట్టలతో కొండలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
సొంత డబ్బులు వెచ్చించి టార్పాలిన్లు కొనుక్కుని గుడారాలు వేసుకున్నారు. ప్రభుత్వం ముందస్తుగా ఎవరికీ టార్పాలిన్లు కూడా సరఫరా చేయలేదు. మూడు మండలాల్లో వందలాది కుటుంబాలు కొండలపై ఉండడంతో పునరావాస చర్యలు మొక్కుబడిగా మారాయి. దొరికితే తిన డం లేదంటే పస్తులతో గడుపుతున్నారు. కొండ దిగువన ఉన్నవారికి అరకొర సాయం అందుతోంది. పునరావాస శిబిరాలు ఏర్పాటుచేసినా వరద నీరు ముంచెత్తుతుండడంతో బాధితులు ఎక్కడెక్కడికో చిక్కుకుపోయారు.రెండురోజుల కిందట అధికారులు ప రామర్శకు వెళ్తే సహాయ క చర్యలపై బాధితులం తా నిలదీశారు. ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేక అంధకారంలోనే గడుపుతున్నారు.
కోనసీమ కకావికలం..
కోనసీమలో 15 మండలాల వరకు వరద ముంపులో చిక్కుకుపోయాయి. వందకుపైగా లంక గ్రామాలు వరదలో మునిగాయి. 72వేల మంది బాధితులు రోడ్డునపడ్డారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మామిడికుదురు, అల్లవరం, పి.గన్నవరం, రాజోలు, సఖినేటిపల్లి... ఇలా అనేక మండలాల్లో లంక గ్రామాల్లో వరద నీరు భారీస్థాయిలో ప్రవహిస్తూనే ఉం ది. వారం రోజులుగా కొనసాగుతున్న వరదతో వందలాది గ్రా మాల్లో ఇళ్లు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మునగగా, మరికొన్నిచోట్ల శ్లాబ్ లెవెల్‌కు వరద వచ్చేసింది. దీంతో వేలాది మంది బాధితులు డాబా ఎక్కి గుడారాలు వేసుకుని రోజులు గడుపుతున్నారు. తాగడానికి వీళ్లకు నీళ్లు దొరకడం లేదు. కిందకు దిగుదామంటే వరద నీరు.. అటు ఇంట్లో కుళాయిలు, మంచినీటి బావులన్నీ వరదలో కలిసిపోయాయి. వందలాది లంక గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అధికారులు వచ్చి కాపాడే పరిస్థితి లేకపోవడంతో దిక్కులేక వీరంతా వరద నీటినే వేడి చేసుకుని తాగుతున్నారు.
తిండి దొరక్క పస్తులుంటున్నారు. ఇప్పటివరకు వందలాది లంక గ్రామాలకు గా ను పదుల సంఖ్యలోనే అధికారుల సహాయక చర్యలు ప్రారంభమయ్యా యి. అక్కడక్కడా శిబిరాల్లో భోజనాలు అందిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వేలాది మంది బాధితుల్లో సర్కారు సా యం అందుతోంది వందల్లోపుమందికే. కోనసీమలో వేలల్లో ఉన్న తాటాకిళ్లు కొట్టుకుపోయాయి. బాధితులు ఎక్కడ ఏటిగట్లు కనిపిస్తే అక్కడకు పిల్లాజెల్ల తో వెళ్లి గుడారాలు వేసుకుని ఉంటున్నారు. చీకటైతే డాబాలపైనా, ఏటిగట్లపైన నివసించే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. విషకీటకాల బెడదతో బెంబేలెత్తుతున్నారు. కనీసం ఇప్పటివరకు వీరికి కొవ్వొత్తులు కూడా అందలేదు. ముఖ్యంగా డాబాలపై నివసిస్తోన్న వందలాది కుటుంబాలకు బహిర్భూమి సమస్యగా మారింది. మరుగుదొడ్లన్నీ వరదలో మునిగిపోయాయి. ఆపదొస్తే ఆస్పత్రికి వెళ్లడానికి.. కనీసం ఫోన్ చేయడానికి సిగ్నల్స్, చార్జింగ్ కూడా లేకపోవడంతో ప్రాణాలుగుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. గోదావరికి వరద ముప్పు పొంచి ఉన్నప్పుడు అధికారులు ముందస్తు సన్నాహాలు చేయాలి.
నష్ట నివారణకు కార్యాచరణ చేపట్టాలి. వరద ముంపు అధికంగా ఉండే లంక గ్రామాల్లో బో ట్లు సిద్ధం చేయాలి. ముంపు పెరిగిన తర్వాత బోట్లలో ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులు, వారి వస్తువులను తరలించాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇదెక్కడా జరగలేదు. కోసీమలో దాదాపు ప్రతి కుటుంబానికీ ఏడాది పొడవు నా తిండి గింజలకు లోటుండదు. ఇప్పుడు వరదతో వేలాది ఇళ్లల్లోకి నీరు వచ్చేయడంతో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇళ్ల ల్లో నిల్వచేసుకున్నవన్నీ నీటిపాలయ్యాయి. దుస్తులు, వంట పాత్రలు, ఆస్తిపత్రాలు... ఇలా అన్నీ కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి చాలా వరకు పాడిపశువులు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కుటుంబానికి నష్టం రూ.5 లక్షలకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు తాటాకిళ్లల్లో నివసిస్తున్న వారు తిరిగి కొత్తది నిర్మించుకోవాలంటే రూ.50వేలకుపైనే ఖర్చవుతుంది. పోయిన సామగ్రికి మరో రూ.50వేలు అవుతుంది. సర్వం కోల్పోయిన ఈస్థితిలో అంత డబ్బుతో పూ ర్వపు జీవనస్థితికి రావడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2006 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గోదావరి వరద కోనసీమను చుట్టుముట్టడంతో నష్టం అపారంగా ఉంది. బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటివరకు 30వేలకుపైగా ఇళ్లు నీటమునిగిపోయాయి. మండలాల వారీగా లంక గ్రామాల్లో రెవెన్యూ ఇతర అధికారులు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలి. కానీ వార్డువలంటీర్లు అన్నీ చూసుకుంటారులే అనే ధోరణితో వారికి అప్పగించారు. అధికారులు ఎవరూ కూడా రావడం లేదు.
అంధకారంలో 237 గ్రామాలు
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గోదావరి నదికి పోటెత్తిన వరదలతో ఉభయ గోదావరి జిల్లాల్లోని 237 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 140, పశ్చిమ గోదావరి జిల్లాలో 97 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సరఫరాను పు నరుద్ధరించేందుకు విద్యుత్‌శాఖ వర్గాలు ప్రయత్నించి నా.. పెరుగుతున్న వరద కారణంగా పనులు ముందుకు సాగ డం లేదు. వరద ప్రవాహం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరి గే అవకాశం ఉండటంతో పునరుద్ధరణ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వరద తగ్గిన వెంటనే ఈ పనులు పునరుద్ధరిస్తామని వెల్లడించా యి.
ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఎప్పటికప్పుడు ఆ ప్రాంత అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. ముంపు ప్రాంతాలకు వెళ్లి సరఫరా పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించాలని ట్రాన్స్‌కో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను శ్రీకాంత్ ఆదేశించారు. ట్రాన్స్‌కోకు చెందిన ఇద్దరు జనరల్ మేనేజర్లను ఈ రెండు జిల్లాలకు నోడల్ అధికారులుగా నియమించారు. అదనపు సిబ్బందిని, విద్యుత్ సామగ్రిని అందుబాటులో ఉంచారు.వరద తగ్గిన 24 గంటల్లో సరఫరా పునరుద్ధరించేలా చూడాలని శ్రీకాంత్ శుక్రవారం ఆదేశించారు. వరదల వల్ల విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ(ఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి వివరాలను సమర్పించారు. రెండు జిల్లాల్లో సుమారుగా రూ.2.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నివేదికలో తెలిపారు.
Updated Date - 2020-08-22T08:52:00+05:30 IST