రైతులు ఏకాకులు కాదు
ABN, First Publish Date - 2020-12-05T09:11:24+05:30
అమరావతి రైతులు ఏకాకులు కాదని, వారికి ఎప్పుడూ అండగా ఉంటానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు.
అమరావతికి 90 శాతం ప్రజల మద్దతు.. త్వరలో ఆనందకరమైన ప్రకటన వింటారు
రాజధాని పోరాటం వృథా పోదు: చంద్రబాబు.. మందడం శిబిరం సందర్శన, రైతులకు మద్దతు
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు ఏకాకులు కాదని, వారికి ఎప్పుడూ అండగా ఉంటానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల త్యాగం, పోరాటం వృథా కావని.. త్వరలోనే ఆనందకరమైన ప్రకటన వింటారన్నారు. న్యాయమే విజయం సాధిస్తుందని వారిలో ధైర్యం నింపారు. అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడం శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి.. మహిళలు, రైతులతో మాట్లాడి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘అమరావతికి రాష్ట్రంలోని 90 శాతం ప్రజల మద్దతు ఉంది. అమరావతి ప్రజలు తమ హక్కుల కోసమే పోరాడుతున్నారన్న సంగతి పోలీసులు గ్రహించాలి. కొంతమంది పోలీసులు ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పైవాళ్లు చెప్పిందల్లా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడేది మీరే’ అని హెచ్చరించారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఎవరి తరం కాదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. అమరావతిని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్న ఆయన... ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయం కోసం ఎదురునిలిచి రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మోసంచేశారని మండిపడ్డారు. తన స్వార్థంకోసం అమరావతిని చంపాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూములిచ్చి బజారుకెక్కే పరిస్థితి వచ్చినా భయపడకుండా పోరాడుతున్నవారికి పాదాభివందనం అంటూ మహిళల పోరాటాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొనియాడారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ మార్గంలో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడు వినిపించేలా మందడం మహిళలు ‘జై అమరావతి’ అంటూ నినదించారు. పెద్దఎత్తున నినాదాలతో మందడం శిబిరం దద్దరిల్లింది. నిరసనకారులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిలువరించారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టారు.
Updated Date - 2020-12-05T09:11:24+05:30 IST