మీది మానవత్వం గల ప్రభుత్వం: ప్రధాని మోదీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ
ABN, First Publish Date - 2020-03-27T22:17:53+05:30
బీజేపీ ప్రభుత్వం మానవత్వగల దృష్టితో రూ.1.75 లక్షల కోట్ల నిధులను అత్యవసర ప్యాకేజీగా అంజేయడం ఎంతో సంతోషంగా ఉందని...
అమరావతి: బీజేపీ ప్రభుత్వం మానవత్వగల దృష్టితో రూ.1.75 లక్షల కోట్ల నిధులను అత్యవసర ప్యాకేజీగా అంజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం ఆయన ఓ లేఖ రాశారు. అందులో బీజేపీ నిర్ణయాలను, విధానాలను అభినందిస్తూ ఆయన పలు విషయాలను పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది, రైతులు, పేదల కోసం కేంద్రం రూ.1.75 లక్షల కోట్ల అత్యవసర నిధిని ప్రకటించడాన్ని ఆయన ఎంతో ప్రశంసించారు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన జనతా కర్ఫ్యూ ఎంతో గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.
‘మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచ దేశాలతో పోల్చితే ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. జనాభా కూడా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ బీజేపీ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. బీజేపీ ప్రభుత్వం కరోనాను పూర్తిగా అరికట్టి ప్రపంచదేశాలకు మన దేశాన్ని ఆదర్శంగా నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది’ అని చంద్రబాబునాయుడు రాసుకొచ్చారు.
అంతేకాకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ చేయించడం ఎంతో అభినందించదగ్గ విషయమని, వారి సేవకు, త్యాగానికి ఇలాంటి ప్యాకేజీలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం వంటి నిర్ణయాలను అభినందించకుండా ఉండలేకపోతున్నానని చంద్రబాబు వివరించారు. ‘ఇంతటి ఉపద్రవ సమయంలోనూ దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే మీ ఆశయం ఎంతో గొప్పది. అందుకే మీ ప్రభుత్వం మానవత్వం గల ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు అభినందించారు.
‘మీ బాధ్యతాయుతమైన పాలన, తెలివైన నిర్ణయాలు, విధానాల వల్ల దేశం కేవలం కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడమే కాకుండా మునుపటి ఆర్థిక స్థితిని కూడా త్వరలోనే అందుకోగలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-03-27T22:17:53+05:30 IST