ఇచ్చామని చెప్పండి.. ఇబ్బంది ఉండదు!
ABN, First Publish Date - 2020-07-08T07:59:11+05:30
ఈఎస్‌ఐ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. మందుల సరఫరాదారులపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన
- అచ్చెన్న సహా ఎవరెవరికి ఎంతిచ్చారో రాసివ్వండి
- ఈఎస్‌ఐ స్కాంలో డీలర్లపై ఏసీబీ అధికారుల ఒత్తిడి?
- వారి బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలపై ఆరా
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఈఎస్‌ఐ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. మందుల సరఫరాదారులపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కొందరు డీలర్లను పిలిపించి.. ‘మీరెందుకు ఇబ్బంది పడతారు..? మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా ఈఎ్‌సఐ అధికారులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో రాసివ్వండి’ అని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు అధికారులైతే మరీ ఇబ్బంది పెడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. తామెవరికీ లంచం ఇవ్వలేదని చెబుతున్నా.. ఆ రోజు మార్కెట్లో ఈ మందుల ధర ఎంత.? మీరు ఈఎ్‌సఐకి సరఫరా చేసిన ధర ఎంత.? అదే తేదీల్లో బయటి మార్కెట్‌కు ఇవే మందులు ఎంత ధరకు సరఫరా చేశారు. అని ప్రశ్నలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విచారణ పేరుతో తమను రోజూ ఉదయం పిలిచి సాయంత్రం వరకూ ఫోన్లు తీసుకుని విసిగిస్తున్నారని.. తమ తప్పు ఉంటే కేసు నమోదు చేసి అరెస్టు చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇంకోవైపు.. మందుల సరఫరాదారుల బ్యాంకు ఖాతాలు, వాటిలో లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వైద్య పరికరాలు, మందుల సరఫరాలో రూ.150 కోట్ల మేరకు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ఈఎ్‌సఐ నుంచి తీసుకున్న చెక్కులు ఏ బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయో అక్కడకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా బ్యాంకుల్లో అకౌంట్లు ఎప్పుడు ప్రారంభించారు..? ఆ డీలర్లు గతంలో జరిపిన లావాదేవీలెంత..? వాటిని తెరిచేందుకు సిఫారసు చేసిన వారి చిరునామాలేంటి..? ఈ నిధులను వేరే అకౌంటర్లకు బదిలీ చేశారా..? పెద్దఎత్తున నగదు ఎప్పుడెప్పుడు విత్‌డ్రా చేశారు.. విత్ డ్రా చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్లు చెక్కుల వెనుక ఉన్నాయా..? లావాదేవీలు ఇప్పటికీ జరుగుతున్నాయా..? ఇలాంటి ప్రశ్నలకు బ్యాంకర్ల నుంచి సమాధానాలు తెలుసుకుంటున్నారు. వారం రోజుల నుంచీ విజయవాడ, హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల్లో ఆరా తీస్తున్నారు.
Updated Date - 2020-07-08T07:59:11+05:30 IST