ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసం కాదు.. డీసీఎం!

ABN, First Publish Date - 2020-12-11T07:26:16+05:30

కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలను వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధికి సీసమే కారణం కావొచ్చుననే అంచనాల్లో నిజం లేదా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు నీటి నమూనాల్లో ‘డైక్లోరో మిథేన్‌’

మోతాదుకు మించి పదులరెట్లు ఉన్నట్లు నిర్ధారణ

20 ప్రాంతాల నుంచి నీటి నమూనాలు

పత్తేబాదలో 960 మైక్రో గ్రాములు

దీనివల్లే ఫిట్స్‌, నోటి వెంట నురగ 

వింత వ్యాధిపై నేడు తుది నివేదికలు 

పరిశీలనకు పది మందితో కమిటీ 

కొత్తగా 16మంది ఆస్పత్రిలో చేరిక

606కు పెరిగిన బాధితుల సంఖ్య 


అమరావతి/ఏలూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలను వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధికి సీసమే కారణం కావొచ్చుననే అంచనాల్లో నిజం లేదా? డైక్లోరో మిథేన్‌(డీసీఎం) అనే రసాయనమే ఈ విపత్తుకు కారణమా? తాజా నివేదికను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ‘ఔను’ అనే సమాధానం లభిస్తోంది. అధికారులు ఏలూరులోని 20 ప్రాంతాల నుంచి సేకరించిన నీటి నమూనాలను హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌కు పంపారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ప్రజలు తాగుతున్న నీటిలో డైక్లోరోమిథేన్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా డైక్లోరోమిథేన్‌ ఒక లీటరు నీటిలో 5 మైక్రో గ్రాముల వరకు ఉండొచ్చు.


కానీ... 20 చోట్ల శాంపిల్స్‌ తీస్తే ఎక్కడా పరిమితులకు లోబడి లేదు. పైగా... నిపుణులే విస్తుపోయే స్థాయిలో ఈ రసాయనం అవశేషాలు కనిపించాయి. పత్తేబాద అనే ప్రాంతంలో  సేకరించిన నీటి నమూనాల్లో ఏకంగా 960  మైక్రోగ్రాముల డైక్లోరోమిథేన్‌ను గుర్తించారు. అశోక్‌ నగర్‌లో 618 మైక్రో గ్రాములు ఉంది. ఇది ప్రమాదకరమైన కర్బన సమ్మేళనంగా వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల వాంతులు, నోటి నుంచి నురగ, కళ్లు తిరగడం, ఫిట్స్‌ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.


భార లోహాలు లేవు...

ఇప్పటిదాకా నీటిలో లెడ్‌, నికెల్‌ వంటి భార లోహాలున్నట్లు భావిస్తున్నారు. కానీ... అవేవీ లేవని సదరు ప్రయోగశాల పరీక్షలో తేలింది. ‘నీటి నమూనాల్లో ఫలానా రసాయనాలు ఉన్నాయేమో చూడండి’ అంటూ ఒక ఐపీఎం ఒక జాబితా ఇచ్చింది. అవేవీ లేవు. కానీ... ప్రమాదకరం కాని పలు ఇతర రసాయనాల అవశేషాలు మాత్రం స్వల్పంగా కనిపించాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మిగిలిన జాతీయ సంస్థల నుంచి రిపోర్టులు రానున్నాయి. ఇప్పటికే వందల నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపిన వైద్యబృందాలు తుది నివేదికలు సిద్ధం చేశాయి. సీసీఎంబీ మినహా మిగతా అన్ని జాతీయ సంస్థలు నేడు నివేదికలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదికల పరిశీలనకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటుచేసే కమిటీలో అన్ని కేంద్రసంస్థల నిపుణులు, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌స, వైద్య నిపుణులు కలిపి మొత్తం పదిమంది సభ్యులు ఉంటారని సమాచారం.


ఈ కమిటీ నివేదికలన్నింటినీ క్రోడీకరించి నిర్ధారణకు రావడంతో పాటు భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు, సూచనలు ఇస్తుంది. కాగా, వింత వ్యాధి లక్షణాలతో గురువారం 16మంది ఏలూరు ఆస్పత్రిలో చేరారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 606కు చేరింది. ఇప్పటి వరకూ 539 మంది డిశ్చార్జి కాగా, 34 మందిని విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. ఏలూరులో 32 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి ఒకరు మృతిచెందారు.


డైక్లోరో మిథేన్‌ను ఎందులో వాడతారంటే...

డైక్లోరోమిథేన్‌(డీసీఎం)ను మిథైలిన్‌ క్లోరైడ్‌ అని కూడా పిలుస్తారు. సాధారణంగా దీనిని దీనిని పెయింట్‌ను తొలగించేందుకు(పెయింట్‌ రిమూవర్‌) వాడతారు. హెయిర్‌ స్ర్పే, కోటింగ్స్‌, రూమ్‌ డియోడరెంట్స్‌ల తయారీలోనూ డీసీఎంను ఉపయోగిస్తారు. కొన్ని రకాల స్టెరాయిడ్స్‌, టాబ్లెట్‌ కోటింగ్‌కు కూడా వాడతారు. పరిమితికి మించిన డీసీఎం ప్రభావం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది నేరుగా నాడీ మండలంపై ప్రభావం చూపిస్తుంది. 



బాధితులకు సీఎస్‌ పరామర్శ

ఏలూరు క్రైం, డిసెంబరు 10: వింత వ్యాధితో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం పరామర్శించారు. తాగడానికి ఏ నీటిని వినియోగిస్తున్నారని ప్రశ్నించగా... కుళాయి నీరేనని బాధితులు బదులిచ్చారు. వైద్య సహాయం, వ్యాధి తీవ్రతపై ఇప్పటి వరకూ సేకరించిన నివేదికలను జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. 


పట్టణంలో ఏయే ప్రాంతాల్లో వ్యాధి తీవ్రంగా ఉంది, ఆస్పత్రిలో చేరిన, డిశ్చార్జి అయిన వారి వివరాలు, నిన్నటికి, ఈ రోజుకి కేసుల సంఖ్యలో వ్యత్యాసం తదితర వివరాలను కలెక్టర్‌ ముత్యాలరాజు ఆమెకు వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో, వైద్యులతో సీఎస్‌ సమావేశమై వ్యాధి ప్రబలడానికి దారితీసిన కారణాలు, నివారణ చర్యలు, ఇప్పటివరకూ అందిన నివేదికలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏకే సింఘాల్‌, జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో కె.సునంద, వైద్య నిపుణులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T07:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising