6 వారాల పాటు ఎన్నికలు వాయిదా
ABN, First Publish Date - 2020-03-16T09:34:30+05:30
కరోనా వైరస్ దృష్ట్యా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటన చేసిన వెంటనే ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రచారాన్ని
ఆగిన ప్రచారం
(ఆంధ్రజ్యోతి-అమరావతి): కరోనా వైరస్ దృష్ట్యా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటన చేసిన వెంటనే ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రచారాన్ని నిలిపివేశారు. నోటిఫికేషన్-పోలింగ్ తేదీ మధ్య గడువు స్వల్పమైనందున కాలంతో పరుగులు పెడుతూ ప్రచారం సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడా గడువు 6 వారాలకు పెరగడంతో తదనుగుణంగా తిరిగి వ్యూహాలు రచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాయిదా వల్ల ప్రచారాన్ని సావకాశంగా చేసుకునే అవకాశం లభించిందని అభ్యర్థుల్లో కొందరు ఆనందిస్తుండగా, పలువురు మాత్రం అన్ని వారాల పాటు ప్రచారపర్వం వల్ల ఎన్నికల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం తథ్యమన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. అంతలోనే ఎన్నికల ప్రక్రియకు అర్ధంతరంగా బ్రేకులు పడ్డాయి. కరోనా అదుపులోకి వచ్చి, దానితో ఇక జనబాహుళ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దాన్ని బట్టే నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం, అనంతరం ఎన్నికల తేదీ ఎప్పుడో ఖరారవనున్నాయి. అప్పటి వరకూ ఆశావహులకు నిరీక్షణ తప్పదు!
Updated Date - 2020-03-16T09:34:30+05:30 IST