వీరే ఆదర్శం...!
ABN, First Publish Date - 2020-03-27T10:11:49+05:30
చాలాకాలం తర్వాత విదేశాలనుంచి ఇంటికి వచ్చి బయట తిరగకుండా ఉండడం కష్టమైనా లోపలే ఉంటున్నామని పలువురు విదేశాలనుంచి
లాక్‌డౌన్ నేపథ్యంలో జిల్లాలో హోంక్వారంటైన్ పాటిస్తున్న ప్రవాసీయులు
కరోనా లక్షణాలున్నా.. లేకున్నా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పాటిస్తామంటూ వెల్లడి
కష్టంగా ఉన్నా ఇలా ఇంట్లోనే ఉంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం
మామిడికుదురు, మార్చి 26:
చాలాకాలం తర్వాత విదేశాలనుంచి ఇంటికి వచ్చి బయట తిరగకుండా ఉండడం కష్టమైనా లోపలే ఉంటున్నామని పలువురు విదేశాలనుంచి వచ్చిన వ్యక్తులు తెలియచేస్తున్నారు. విదేశాలనుంచి జిల్లాలోని చాలా ప్రాంతాలకు రెండునెలలుగా చాలామంది ఎన్‌ఆర్‌ఐలు వచ్చారు. తమలో కరోనా లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. లాక్‌డౌన్ నేపథ్యంలో మిగిలిన ప్రజల ఆరోగ్యశ్రేయస్సు దృష్ట్యా తాము బయటకు రామంటున్నారు. వీరిలాగే అందరూ ఆదర్శంగా నిలిచి ఇంటికి పరిమితమైతే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుంది.
పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ వెళ్తా..
ముమ్మిడివరం: నేను చైనాలోని ఓ యూనివర్సిటీలో హాస్టల్‌లో ఉంటూ ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నాను. మేము ఉంటున్న యూనివర్సిటీ ప్రాంతంలో కరోనా వైరస్ లేదు. ఇంటి దగ్గర పేరెంట్స్ కంగారుపడి వచ్చేయమని ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 10న వచ్చేశాను. యూనివర్సిటీలో మాకు వైద్యపరీక్షలన్నీ నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చారు. కోల్‌కతా వరకు విమానంలో వచ్చాం. అక్కడ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అక్కడినుంచి ట్రైన్‌లో ఇంటికి వచ్చాం. ప్రస్తుతం చైనాలో పరిస్థితులు చక్కబడుతున్నట్టు సమాచారం వచ్చింది. స్కూళ్లు, కళాశాలలు కూడా తెరుస్తున్నారంట. నేను మాత్రం పూర్తి ఽధైర్యంతోనే ఉన్నాను. ఇక్కడి పరిస్థితులు చక్కబడిన వెంటనే అక్కడకు వెళ్లి చదువు పూర్తి చేసి వస్తాను.
మెడికల్ స్టూడెంట్(చైనా యునివర్సిటీ), కొత్తలంక, ముమ్మిడివరం మండలం
ఇబ్బందిగా ఉన్నా ఇంటికి పరిమితమవుతా..
సఖినేటిపల్లికి చెందిన నేను దుబాయ్‌దేశం నుంచి మార్చి 20న స్వగ్రామానికి వచ్చాను. ఏప్రిల్ 3 వరకు స్వీయ నిర్భందంలో అధికారుల ఆదేశాల మేరకు ఇంటివద్దే ఉంటున్నాను. ఎప్పుడు గల్ఫ్‌నుంచి వచ్చినా బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లేవాడిని. ప్రస్తుతం కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నిరోజులు ఇబ్బందిగా ఉన్నా లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఇలాగే ఇంటికి పరిమితమై ఉంటాను.
-దుబాయ్‌నుంచి వచ్చిన వ్యక్తి, సఖినేటిపల్లి
ఇష్టం లేకపోయినా.. ప్రజలకోసం పాటిస్తున్నాను..
రామేశ్వరం గ్రామానికి చెందిన నేను కువైట్ దేశంనుంచి ఈ నెల 12న ఇంటికి వచ్చాను. కొన్నిరోజులకు కరోనా ప్రభావం ఉందని తెలిసి స్థానిక అధికారులు ఇంటికివచ్చి స్వీయ నిర్భంధం చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఇంట్లో ఒక గదికే పరిమితమై కుటుంబసభ్యులతో కూడా మాట్లాడకుండా.. ఇష్టం లేకపోయినా కష్టంగా ప్రజలకోసం స్వీయ నిర్భంధం పాటిస్తున్నాను.
-కువైట్‌నుంచి వచ్చిన వ్యక్తి, సఖినేటిపల్లి మండలం
ప్రజలు బాగుండాలనే సదుద్ధేశంతో...
వీవీ మెరకు చెందిన నేను మస్కట్ దేశం నుంచి మార్చి 19న ఇంటికి వచ్చాను. అప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపించారు. అయినా ఇంట్లోనే ఉంటూ బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లకుండా కష్టమైన స్వీయ నిర్భంధం పాటిస్తున్నా. నా కుటుంబంతోపాటు ప్రజలు బాగుండాలనే సదుద్ధేశంతో ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నాను.
-మస్కట్ దేశం నుంచి వచ్చిన వ్యక్తి, సఖినేటిపల్లి మండలం
Updated Date - 2020-03-27T10:11:49+05:30 IST