రంగుల పేరుతో దోపిడీ
ABN, First Publish Date - 2020-12-30T05:36:57+05:30
జగన్ సర్కారు రంగుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విమర్శించారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు తక్షణం అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
- టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణం అప్పగించాలి
- రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 29: జగన్ సర్కారు రంగుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విమర్శించారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు తక్షణం అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గొడౌన్ సమీపంలో నిర్మించిన గృహాలు, బొమ్మూరులో నిర్మించిన గృహాలు, శాటిలైట్ సిటీ డి-బ్లాక్‌లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలను మంగళవారం వారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శులు వెలుగుబంటి ప్రసాద్, కాశి నవీన్‌కుమార్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన పనులు మినహా మరి ఏ ఇతర మౌలిక సదుపాయాలను ఈ గృహాల్లో కల్పించలేదని, వైసీపీ రంగులు మాత్రమే వేశారన్నారు. మతి తప్పిన పాలనతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు కల్పిస్తున్నారన్నారు. పేదల కోసం తాము అప్పుడే ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని, సబ్ స్టేషన్ కూడా నిర్మించామని తెలిపారు. హుకుంపేట పరిధిలో ఒడియాపేట వాసులకు, 220 కేవీ హెచ్‌టీ లైను కింద ఉంటున్న వారికి గృహాలు కేటాయించాలని నిర్ణయిస్తే వారికి ఇవ్వకుండా ఎక్కడో ఇస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా గృహ సముదాయాల వద్ద కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా సుమారు రూ.500 కోట్లు వెచ్చించి రంగులు వేసి వాటిలో రూ.100 కోట్లు కమీషను లాగేశారని ఆరోపించారు. శాడిస్ట్ ముఖ్యమంత్రి అరాచక విధానాలు పేదల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో 12,846 మంది అర్హులుండగా కేవలం 1,199 మందికే గృహాలు కల్పించడం దారుణమని గోరంట్ల, గన్ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:36:57+05:30 IST