ఆయన ‘బాధ్యత’తో... మూడు నెలల తర్వాత ఇంటికి చేరిన వృద్ధురాలు
ABN, First Publish Date - 2020-12-29T06:14:08+05:30
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు మూడు నెలల తర్వాత ఇంటికి చేరుకుంది. వివరాలు ఇలా వున్నాయి... కాకినాడ మెయిన్‌రోడ్డు ఆనందభారతి ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ముచ్చి అరవింద (అనంత) ఒంటరిగా నివసిస్తోంది.
జీజీహెచ్ (కాకినాడ), డిసెంబరు 28: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు మూడు నెలల తర్వాత ఇంటికి చేరుకుంది. వివరాలు ఇలా వున్నాయి... కాకినాడ మెయిన్‌రోడ్డు ఆనందభారతి ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ముచ్చి అరవింద (అనంత) ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబరు 14వ తేదీ తెల్లవారుజామున ఆనందభారతి సమీపంలో మెయిన్‌రోడ్డులోకి టీ తాగడానికి వస్తుండగా తొట్టె రిక్షా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆమె కాలు విరగడంతో పాటు గాయాలయ్యాయి. రోడ్డుపై అపస్మారకస్థితిలో ఉన్న క్షతగాత్రురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. ఆమె వివరాలు వెల్లడించకపోవడంతో వైద్యులు ఎమ్మెల్సీ నమోదు చేసి జీజీహెచ్‌లోని డీవీఎల్ (అన్‌నోన్ వార్డు)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు పెద్దాపురానికి చెందిన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ సపర్యలు చేసి కోలుకునేలా కృషి చేశారు. రెండు రోజుల కిందట తన పేరు ముచ్చి అరవింద (అనంత) అని, తాను ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నానని, తన మేనల్లుడు కుమార్ మునిసిపాలిటీలో పనిచేస్తున్నాడని సత్యనారాయణకు తెలిపింది. ఆ వివరాలతో ఎంక్వయిరీ చేసి కుమార్‌కు అనంత విషయాన్ని తెలిపారు. దాంతో సోమవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అనంతను అప్పగించారు. తన మేనత్త కోసం టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశామని, మూడు నెలల కిందట అదృశ్యమైన ఆమె ప్రాణంతో ఉండడం ఆనందంగా ఉందని మేనల్లుడు కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆరోగ్యంగా కోలుకునేలా కృషి చేయడమే కాకుండా తనకు అప్పగించిన సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ, వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-12-29T06:14:08+05:30 IST