ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌.. హైరానా

ABN, First Publish Date - 2020-11-01T06:52:49+05:30

కొవిడ్‌ ప్రభావం లేకుంటే అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభమై మూడు నెలలయ్యేది. విద్యార్థులతో కళాశాలలన్నీ కిటకిటలాడుతూ ఉండేవి. కళాశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, బస్సులు రోడ్డుపై తిరుగుతూ సందడి సందడిగా ఉండేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అడ్మిషన్లపై అయోమయం.. గందరగోళం
  • ఈనెల 6న ముగియనున్న ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ 
  • ఆఫ్‌లైన్‌ విధానానికి మొగ్గు చూపుతున్న ప్రైవేట్‌ కళాశాలలు
  • ఆన్‌లైన్‌లో కనబడని కార్పొరేట్‌ కళాశాలల జాబితా 
  • ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లితండ్రులు 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ ప్రభావం లేకుంటే అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభమై మూడు నెలలయ్యేది. విద్యార్థులతో కళాశాలలన్నీ కిటకిటలాడుతూ ఉండేవి. కళాశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, బస్సులు రోడ్డుపై తిరుగుతూ సందడి సందడిగా ఉండేది. కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్‌ ఉనికి ఇంకా ఆందోళనకరంగా ఉండడంతో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, వారి తల్లితండ్రులు హైరానా చెందుతున్నారు. కొత్తగా ఈ ఏడాది ఇంటర్‌ బోర్డు సదరు ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పద్ధతిలో స్పష్టత లేకపోవడంతో ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారింది. కొన్ని కార్పొరేట్‌ కళాశాలల జాబితా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని తల్లితండ్రులు వాపోతున్నారు. తొలి విడత ప్రవేశాలు ఈనెల 6న ముగియనున్నాయి. దీంతో వీరిలో మరింత కంగా రు మొదలైంది. కొవిడ్‌ ప్రభావంతో టెన్త్‌ విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్‌ చేసింది. దీంతో జిల్లాలో 64 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీరంతా తమకు నచ్చిన కళాశాలల్లో చేరడానికి ఉరకలేస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌ విధానం వీరికి ఆటంకంగా మారింది. కొవిడ్‌ లేక ముందు గత విద్యా సంవత్సరం వరకు ప్రైవేట్‌,  కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు ఇష్టారాజ్యంగా జరిగేవనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్‌లు ఇవ్వడం, కళాశాలల్లో ఎటువంటి మౌలిక వసతులు లేకుండానే తరగతులు నిర్వహించడం జరిగేది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను పక్కనపెట్టి కాలేజీ బ్రాండ్‌ నేమ్‌ సాకుగా చూపి భారీగా ఫీజులు వసూలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలకు చెక్‌ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ఎలాగంటే.. ప్రభుత్వం, ప్రభుత్వ ఎయి డెడ్‌, ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఇంటర్‌ మొదటి ఏడాదిలో అడ్మిషన్లు ఇవ్వాలంటే ప్రతీ విద్యార్థి ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కోర్సు కోసం దరఖాస్తు చేయాలని ఆదేశించింది. అలాగే ఇంటర్‌లో ఒక్కో సెక్షన్‌లో ఉన్న ఇన్‌టేక్‌ (విద్యార్థుల సంఖ్య) 88 నుంచి 40కి కుదించింది. ఈ నిబంధనలు అన్ని యాజమాన్యాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా వసతులు సమకూరిస్తేనే అడ్మిషన్లకు అనుమతి ఇస్తా మంటూ మెలిక పెట్టింది. ఇంటర్‌ బోర్డు నిర్ణయించిన ప్రకారం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్‌ యాజమాన్యాల గొంతులో వెలక్కాయ పడింది. ఇప్పటి వరకు ప్రైవేట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి ఏటా రూ.25 వేల నుంచి రూ.40 వరకు ఫీజు లాగేస్తున్నారు. ద్వితీయ సంవత్సరం ఫీజు రూ.30 వేల నుంచి రూ.45 వేలు గుంజుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ ప్రవేశాలు పక్కాగా అమలయితే తాము కళాశాలలన్నీ ఎత్తేయక తప్పదని భావించిన యాజమాన్యాలు ప్రత్యామ్నయ చర్యల దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

  • ఇవీ ప్రభుత్వ ఫీజులు 

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు ఎయిడెడ్‌ కళాశాలల్లో రూ.1,560, సెకండ్‌ ఇయర్‌కు రూ.1,760. ప్రైవేట్‌లో ఫస్ట్‌ ఇయర్‌కు రూ.3,119, సెకండ్‌ ఇయర్‌లో రూ.3,476 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి షెడ్యూల్‌ మేరకు గత నెల 21 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీనికిముందు ఆయా కళాశాలల్లో ఇన్‌టేక్‌ కెపాసిటీ జాబితా సమర్పించాలని యాజమాన్యాలను ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. దీనికి సంబంధించి జీవో 23 జారీ అయ్యింది. అయితే జీవోను ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. దీంతో వారి కెపాసిటీని కొన్ని కళాశాలలు బోర్డుకు సమర్పించలేదు. దీంతో అటువంటి కళాశాలల జాబితాను బోర్డు తన లాగిన్‌ నుంచి బహిష్కరించింది. సదరు కాలేజీల జాబితా ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి కొవిడ్‌ ఉధృతంగా ఉన్న ఆగస్టులోనే కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌ మొదటి ఏడాదికి సంబంధించి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేశాయి. అదే నెలలో టెన్త్‌ విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్‌ చేయడంతో తమ సిబ్బందిని ఆయా స్కూళ్లకు పంపి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ వివరాలు సేకరించి, తర్వాత వారికి ఫోన్‌ చేసి ముందస్తుగా అడ్మిషన్లు పూర్తిచేశాయి. అడ్మిషన్‌ ఖరారు చేసుకోడానికి అప్లికేషన్‌ ఫీజు రూ.300, ఇన్‌స్టంట్‌ వార్షిక ఫీజు రూ.2000 కట్టించుకున్నాయి. ఇదే సమయంలో కొన్ని కళాశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విధించిన షరతులతో కొత్తగా ఆన్‌లైన్‌ అడ్మిషన్ల సంగతి ఏంటో తెలియక యాజమాన్యాలు సందిగ్ధంలో ఉన్నాయి. 

  • రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పనిసరి 

ఈ ఏడాది నుంచి విద్యార్థి తనకు నచ్చిన ఐదు కళాశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా నచ్చిన కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే విద్యార్థికి వచ్చిన జీపీఏ ద్వారా అడ్మిషన్‌ లభిస్తోంది. అలాగే ప్రైవేట్‌ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఈ ఏడాది నుంచి రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఓసీలకు 50 శాతం సీట్లు, మిగిలిన శాతం ఆయా రిజర్వేషన్‌ వారీగా అన్ని కులాలకు సీట్లు కేటాయించాలి. ఇప్పటివరకు ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో తప్ప, ప్రైవేట్‌లో రిజర్వేషన్‌ అమలు కాలేదని తెలిసిందే. ఇప్పుడు ఈ పరిస్థితి ప్రైవేట్‌ యాజమాన్యాలకు తలనొప్పిగా మారింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ విధానం నుంచి తప్పుకోవడంతో అంతా అయోమయంగా మారింది.

  • ఇన్‌ టేక్‌  కెపాసిటీ అప్‌లోడ్‌ చేయలేదు : రీజనల్‌ ఇంటర్‌ బోర్డు అధికారి శారద 

ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఇంటర్‌ బోర్టు ప్రాంతీయ అధికారి (ఆర్‌ఐవో) శారదను వివరణ కోరగా ఇది నిజమేనని, అయితే ఇప్పటివరకు 2.50 లక్షల మంది విద్యార్థులు ఆన్‌ లైన్‌లో ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పొందారన్నారు. అడ్మిషన్లకు ఈనెల 6 వరకు గడువుందన్నారు. కొన్ని యాజమాన్యాలు వారి ఇన్‌ టేక్‌  కెపాసిటీ వెబ్‌లో అప్‌లోడ్‌ చేయలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి ఉందని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆమె తెలిపారు.

Updated Date - 2020-11-01T06:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising