సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
ABN, First Publish Date - 2020-03-27T10:34:11+05:30
క్షేత్రస్థాయిలో నిత్యావసర సరుకుల రవాణా, పంపిణీ విషయంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే
కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
కాకినాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో నిత్యావసర సరుకుల రవాణా, పంపిణీ విషయంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 1902కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కోరారు. కలెక్టరేట్ నుంచి ఎస్పీతో కలిసి ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నిత్యావసర సరుకుల రవాణాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులు లేకుండా చూడాలన్నారు. మాస్క్‌ల కొరత అధిగమించడానికి డీఆర్‌డీఏ ద్వారా 10 వేల మాస్క్‌లు సిద్ధం చేసి కాకినాడ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయాలకు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి అభినంద నీయమన్నారు.
జిల్లాలో మద్యం అమ్మకాలు, సారా అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ సరుకు రవాణా చేసే వాహనాలకు పోలీసులు ఆటంకం కలిగించవద్దన్నారు. అలాగే పత్రికా విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, ఎలకా్ట్రనిక్ మీడియా ప్రతినిధులను అనుమతించాలని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డు కానీ సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డును కానీ చూపించిన వారి విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అందరూ సమష్టిగా కృషి చేస్తే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చునని ఆయన చెప్పారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
జేసీ లక్ష్మీశ మాట్లాడుతూ 25 రకాల వస్తువులను నిత్యావసర సరుకులుగా గుర్తించామన్నారు. ఎగుమతి, దిగుమతి విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జేసీ-2 రాజకుమారి మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామ సచివాలయాల నుంచి డిజిటల్ ఆపరేటర్ల ద్వారా డేటాను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే శానిటైజర్ల కొరత లేకుండా చూస్తామన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ మాట్లాడుతూ తాగునీరు, సీజనల్ వ్యాధుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా నియంత్రణతో పాటు ఇతర వ్యాధులపై వైద్యులు దృష్టి సారిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-27T10:34:11+05:30 IST